హైదరాబాద్ భాగ్యనగరం బల్క్ డ్రగ్ తయారీ పరిశ్రమలకు పెట్టింది పేరు. వెయ్యికిపైగా మందుల తయారీ పరిశ్రమలున్న ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బాగ్యనగరం.. మత్తుమందుల ముఠాల కారణగా అపఖ్యాతి పాలవుతోంది. మందుల తయారీకి సమృద్ధిగా ఉన్న వనరులను ఆసరా చేసుకుని భారీ మొత్తంలో మత్తు మందుల తయారీకి అక్రమార్కులు తెర తీస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు బయట దేశాలకు ఇక్కడ నుంచే వివిధ రకాల మత్తుమందులు ఎగుమతి చేస్తున్నారు.
రెండు చేతులా సంపాదిస్తున్నారు అక్రమార్కులు. మూతపడిన, నష్టాల ఊబిలో చిక్కుకున్న పరిశ్రమలే మత్తుమందుల ముఠాల అక్రమాలకు అడ్డాలు అవుతున్నాయి. నగర శివారు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నాయి. ఇటీవలే జిన్నారం ప్రాంతంలో ఓ కంపెనీలో డీఆర్‌ఐ అధికారులు చేసిన సోదాల్లో ఏకంగా వంద కోట్లకుపైగా విలువైన మాదక ద్రవ్యాల పట్టుబడ్డాయి.ఈ దందాలో బొబ్బా వెంకట్‌రెడ్డి పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో "ఈనాడు-ఈటీవీ'' బృందం మత్తు ముఠాల ఆగడాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించగా అనేక విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
60-70 పరిశ్రమల్లో..
భాగ్యనగర శివార్లలో జీడిమెట్ల, పాశమైలారం, పటాన్‌చెరు, గడ్డపోతారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, మేడ్చల్, చర్లపల్లితోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, వెలిమినేడు, వలిగొండ, ధర్మోజిగూడెం తదితర ప్రాంతాల్లో వెయ్యికిపైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్నాయి.
కాని కొన్ని చిన్న కంపెనీలు ఉత్పత్తి చేసే మందులకు డిమాండ్ లేకపోవడం... మార్కెటింగ్ చేసుకోలేకపోవడం... తదితర కారణాల వల్ల పెట్టుబడులకు తగినట్లు రాబడులు రాక నష్టాల ఊబిలోకి నెట్టబడి మూత పడుతున్నాయి. ఇవే అక్రమార్కులకు అడ్డాలుగా మారుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటివి 60 నుంచి 70 వరకు ఉంటాయని అంచనా. మత్తు ముఠాలు నిషేధిత మాదకద్రవ్యాల తయారీకి ఇలా మూతపడ్డ వాటినే ఉపయోగిస్తున్నట్లు పలుమార్లు నిఘా సంస్థల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కొందరైతే... ఇళ్లలోనే ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుని మత్తుమందుల తయారీ దందాను సాగిస్తున్నారు. జీడిమెట్ల సుభాష్‌నగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఇలాంటి ల్యాబ్‌ల బాగోతం గతంలో బహిర్గతమైంది.
హైదరాబాగ్ అడ్డా ఎందుకంటే..
గంజాయి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన అటవీ ప్రాంతం. అక్కడ అటవీ ప్రాంతంలో వందల ఎకరాలల్లో గంజాయి సాగుచేసి హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుండడం సర్వసాధారణం. ఇతర మత్తు మందులను దేశంతోకి గుట్టుగా దిగుమతి చేసుకోవడం జరిగేది. కాని గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే మాదకద్రవ్యాలు తయారై విదేశాలకు ఎగుమతి అవుతుండడం విస్తుగొలుపుతోంది.
గడిచిన రెండు, మూడు సంవత్సరాలుగా ఎక్సైజ్, పోలీసు శాఖలతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్-డీఆర్‌ఐ సోదాల్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నగరంలో బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులు, రసాయనాలు బహిరంగంగానే లభిస్తుంటాయి. ఫార్మాపై గట్టి పట్టున్న నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు. వివిధ కారణాలతో మూతపడిన కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మాదకద్రవ్యాల తయారీ ముఠాలకు ఇవన్నీ కలిసొస్తున్నాయి.
జాబ్‌వర్క్ పేరిట లీజుకు తీసుకుని..
పెద్ద, పెద్ద అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలున్న కంపెనీలకు జాబ్ వర్క్ చేసేవిగా చిన్న చిన్న కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. వాస్తవానికి పెద్ద కంపెనీలకు వచ్చే భారీ ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయడానికి ఇలా ఏర్పాటైన చిన్న కంపెనీలకు కొన్ని పనులను అప్పగించి చేయించుకోవడాన్ని జాబ్ వర్క్ అని ముద్దుగా పిలుస్తారు. జాబ్ వర్క్‌ల పేరుతో అక్రమార్కులు కొందరు మూతపడిన పరిశ్రమల యజమానుల్ని సంప్రదించి జాబ్ వర్క్ చేసుకునేందుకు లీజుకు కావాలని అడుగుతున్నాయి.