పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగుడెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరొక వ్యక్తి ప్రాణాప్రాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని మసీదు సెంటర్లో సంపత్, జానీ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తూ గొడవ పడ్డారు. పక్కనే ఉన్న చేబ్రోలు వెంకటేశ్వరరావు వారికి సర్ది చెప్పబోయారు. అప్పటికే పూటుగా తాగిన మత్తులో ఉన్న జానీ తన వద్ద ఉన్న సర్జికల్ చాకుతో వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. వెంకటేశ్వరరావు కంఠం తెగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే...
రక్తపు మడుగులో పడిపోయిన వెంకటేశ్వరరావును స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు తేల్చేశారు. ఈ ఘర్షణలో జానీ స్నేహితుడు సంపత్ కూడా గాయపడ్డాడు. అతన్ని తణుకులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.