గోవాలో స్థావరం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి మట్కా నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు అతనికి సహకరిస్తున్న మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 84 వేల రూపాయల నగదు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన శ్రీనివాసులు.. పదేళ్ల కిందట గోవాకు వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మట్కా నిర్వహిస్తున్నాడు.
రోజుకు లక్ష రూపాయల మేర మట్కా డబ్బులు చెల్లించేవాడు. ఇటీవల కాలంలో శ్రీనివాసులు కడపకు రాగా పోలీసులకు సమాచారం అందింది. శ్రీనివాసులుతోపాటు మరో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. మరికొంత మందిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. మట్కా దందాపై నిఘా పెంచామని డీఎస్పీ సునీల్ చెప్పారు.