ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఆ పెళ్లికి సినిమా ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...!

పాత సినిమాల్లోని క్లైమాక్స్​లోలాగా సాఫీగా సాగే పెళ్లిలో ఒక్కసారిగా... 'ఆపండీ...' అంటూ వచ్చే సౌండ్ ఆ మంటపంలోనూ వినిపించింది. కానీ... ఆ అరుపునకు ఆధారాల్లేవని అందరూ తేల్చేసి.... సగంలో ఆగిన పెళ్లి తంతును మళ్లీ మొదలుపెట్టారు. ఈలోపే ఇంకో సినిమాలోలాగా... అధికారులు మంటపానికి వచ్చి "ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు" అనే డైలాగ్​. అంతటితో ఆ పెళ్లి తంతుకు మధ్యలోనే శుభం కార్డు పడింది. అసలు ఆ వివాహానికి అన్ని విఘ్నాలేంటీ...? ఎందుకు ఆ పెళ్లి ఆగిపోయింది...?

ఆ పెళ్లికి సినిమా ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...!
ఆ పెళ్లికి సినిమా ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...!

By

Published : Nov 11, 2020, 10:47 PM IST

కల్యాణమొచ్చినా... కక్కొచ్చినా... ఆగదంటారు. రాసిపెట్టుంటే... ఎన్ని విఘ్నాలెదురైనా పంచభూతాలే పెళ్లిపెద్దలై ఇద్దరినీ ఒక్కటి చేస్తాయంటారు. ఇక్కడ మాత్రం వేరువేరు రూపాల్లో విఘ్నాలు ఎదురై పెళ్లిని అడుగడుగునా అడ్డుకున్నాయి.

బంధువుల హడావుడి... మధ్య సాగుతున్న పెళ్లిలో ఒక్కసారిగా.. 'ఆపండి' అంటూ ఓ యువతి ఆర్తనాదం. అంతా నిశ్శబ్దం. వరుడు తనను ప్రేమించి వేరే అమ్మాయి మెళ్లో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడంటూ... అందరి గుండెల్లో ఆ యువతి బండేసింది. ఆ విఘ్నాన్ని జయించి ఎలాగోలా వివాహాన్ని జరుపాలనుకుంటే... అసలుకే ఎసరు వచ్చింది. చివరికి ఆ మంటపంలో జరగాల్సిన పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.

తెలంగాణలోని సికింద్రాబాద్​ మోండామార్కెట్ పీఎస్ పరిధిలోని వెస్లీ చర్చిలో జనగామ జిల్లా గుమ్మడి పాలెంకు చెందిన అనిల్... తుకారం గేట్​కు చెందిన అమ్మాయితో పెళ్లి జరుగుతోంది. ఇంతలో ఓ యువతి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. వరుడు అనిల్ తనను ప్రేమించి మోసం చేశాడని గొడవకు దిగింది. విషయం తెలుసుకొని పోలీసులు రంగప్రవేశం చేయగా... అనిల్​కు ఆ యువతికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి... ఆ అమ్మాయిని మంటపం నుంచి పంపించేశారు.

ఇక పెళ్లిని ఎలాంటి అడ్డంకి లేకుండా జరపాలని అందరూ ప్రార్థిస్తున్న సమయంలోనే... మరో విఘ్నం రానే వచ్చింది. ఈ సారి ఆ ఇబ్బంది... చైల్డ్​లైన్​​ అధికారుల రూపంలో ఎంటరైంది. పెళ్లి మండపంలోకి ప్రవేశించిన అధికారులు వధువు వయస్సు ఆరాతీశారు. పెళ్లికూతురు వయస్సు 17 ఏళ్లని తేలింది. అప్రమత్తమైన బంధువులు.. పెళ్లి కూతురును కనిపించకుండా వరంగల్ పంపినట్లు అధికారులు తెలుసుకున్నారు.

ఈసారి మాత్రం పెళ్లి పూర్తిగా రద్దయింది. మధ్యలోనే ఆ మ్యారేజ్​ ఈవెంట్​కు శుభం కార్డు పడింది. మరోవైపు... చైల్డ్​లైన్ అధికారులు మోండా మార్కెట్ పీఎస్​లో ఫిర్యాదు చేయగా... వివాహ బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: వైకాపా నిరంకుశత్వంతో ప్రజలను బాధిస్తోంది: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details