ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఇండోర్‌ డ్రగ్స్‌ దందా రూ.100 కోట్లకు పైమాటే - Indoor Drugs latest News

హైదరాబాద్‌ వాసి నుంచి రూ.70 కోట్ల విలువ చేసే నిషేధిత మాదకద్రవ్యాల్ని మధ్యప్రదేశ్‌ పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తులో తెలంగాణ సాయాన్ని మధ్యప్రదేశ్‌ పోలీసులు కోరారు. దేశంలో భారీగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల కేసుల్లో ఇది ఒకటని వెల్లడించారు.

madhya-pradesh
madhya-pradesh

By

Published : Jan 8, 2021, 2:12 PM IST

హైదరాబాద్‌ వాసి నుంచి రూ.70 కోట్ల విలువ చేసే నిషేధిత మాదకద్రవ్యాల్ని మంగళవారం పట్టుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వేద్‌ప్రకాశ్‌, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ చేపట్టాలని ఇండోర్‌ ఏడీజీ యోగేష్‌ దేశ్‌ముఖ్‌ తెలంగాణ పోలీసులకు లేఖ రాశారు. మంగి వెంకటేశ్‌, దినేశ్‌ అగర్వాల్‌, అక్షయ్‌ అగర్వాల్‌, చిమన్‌ అగర్వాల్‌లను ఈ కేసులో ఇతర నిందితులుగా గుర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ను వేద్‌ ప్రకాశ్‌, వెంకటేశ్‌ తీసుకు వస్తే.. స్థానికంగా ఉండే మిగతా ముగ్గురు కొనుగోలు చేసేవారని వివరించారు. వేద్‌ప్రకాశ్​ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంటూ.. వ్యవహారం నడిపించినట్లు తెలిసిందన్నారు. ఇప్పటివరకు సమారు రూ.100 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను చట్ట విరుద్ధంగా పలు దేశాలకు తరలించినట్లు అంచనా వేశారు.

కొనుగోలుదారులపైనా ఆరా

నిందితుల నుంచి 70 కిలోల ఎండీఎంఏ(మిథైల్‌ ఎనిడియోక్సి మెథాంఫెటమిన్‌)ను ఇండోర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్‌ విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. దేశంలో భారీగా పట్టుబడ్డ మాదక ద్రవ్యాల్లో ఇది ఒకటని తెలిపారు. ఇండోర్‌ నుంచి ఇతర దేశాలకు ఈ మాదక ద్రవ్యాలను సరఫరా చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విదేశాల్లో ఎవరు కొనుగోలు చేస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు గురువారం వేద్‌ప్రకాశ్‌కు చెందిన ఫార్మా కంపెనీలో సోదాలు చేశారు. కూకట్‌పల్లి ప్రశాంతినగర్‌లోని ఈ (ఆరిస్టాన్‌ ఫార్మా నోవాటెక్‌) కంపెనీలో మాదకద్రవ్యాలను తయారు చేసినట్లు ఇప్పటివరకు ఆనవాళ్లు లభించలేదని తెలిసింది. నగరంలోనే మరెక్కడైనా వీటిని తయారు చేశారా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు క్యాటరింగ్‌, టెంట్‌హౌస్‌ ముసుగులో మాదకద్రవ్యాల దందా సాగించినట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌ పోలీసుల నుంచి కేస్‌ ఫైల్‌ తెప్పించుకుని సమగ్ర దర్యాప్తు చేపడతామని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details