ఆటో కోసం ఎదురుచూస్తున్న యువకుడిని కిడ్నాప్ చేసిన నిందితులను హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న అర్థరాత్రి షేక్ రహీమ్(21)ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు అందిందని తెలిపారు. ఫిర్యాదులో ఉన్న సమాచారం ప్రకారం ఫతేనగర్ సమతానగర్లో నివసించే షేక్ రహీం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు కంపెనీ కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19న రాత్రి పదకొండున్నరకు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో ఆటోలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు రహీంను ఆటోలో ఎక్కించుకొని డబ్బులు ఇవ్వాలంటూ దాడి చేశారు.
డబ్బులు లేవు అనటం వల్ల.. రహీమ్ తల్లికి అతని ఫోన్ నుంచి కాల్ చేసి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రహీమ్ను హతమారుస్తామని బెదిరించారు. రహీమ్ తల్లి రూ.10 వేలు ఆన్లైన్ ద్వారా పంపించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకున్నారు. పటాన్చెరులో ఉన్నట్లు తెలియగా... అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితులు రహీమ్ను అక్కడే వదిలివేసి పరారయ్యారు.