క్రికెట్ మ్యాచులంటే క్రీడాభిమానులకు పండగే. అందులోనూ 20-20 మ్యాచులంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి బంతికి మ్యాచ్ ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. చివరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో ఊహించలేము. క్షణక్షణం ఉత్కంఠగా కొనసాగుతున్న ఐపీఎల్ మ్యాచుల్లో అయితే క్రికెట్ అభిమానులు మజాను ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచులను ఆసరా చేసుకొని బెట్టింగ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీగా బెట్టింగ్ నిర్వహిస్తూ.. యువతను అప్పుల ఊబిలో నెడ్తున్నారు. మారుమూల ప్రాంతాలకు బెట్టింగ్ సంస్కృతి పాకింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని యువతతో పందెం కాయిస్తున్నారు. నిర్వాహకులు సూచించిన అప్లికేషన్లను చరవాణిలో డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్తే చాలు. మనకు ఇష్టమైన క్రీడాకారుడు, జట్టు, గెలుపు, పరుగు ఇలా విభిన్నంగా పందెం కాయొచ్చు. కొంతమంది ఏజెంట్లు తమ సహాయకులను రంగంలోకి దింపి యువకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ బెట్టింగ్‌లో డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. నిర్వాహకులే ఎక్కువగా డబ్బులు పొందుతున్నారు. దీంతో డబ్బులు కోల్పోతున్న కొంతమంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఝార్ఖండ్‌కు చెందిన సోనూ కుమార్ అనే యువకుడు బతుకుదెరువు నగరానికి వచ్చి పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో ఉండేవాడు. ఐపీఎల్ మ్యాచుల్లో బెట్టింగ్ పెట్టి అప్పులపాలయ్యాడు. ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 3న గదిలో ఉరేసుకొని చనిపోయాడు. కరీంనగర్‌కు చెందిన నితీశ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి కూడా నాలుగు నెలల క్రితం బెట్టింగ్‌లో రూ. 4 లక్షలు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ వెంగల్ రావు నగర్‌కు చెందిన ఓ యువకుడు గతేడాది బెట్టింగ్‌లో నష్టపోయి బలవన్మరణం చెందాడు.