ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్లు కాపురం చేశాడు. చివరికి అనుమానంతో భార్యను హతమార్చాడు. ఈ దారుణం గణపవరం మండలం పిప్పరలో సంచలనం సృష్టించింది. పిప్పరకు చెందిన బోయిన నరేష్.. అదే గ్రామానికి చెందిన కాకిలేటి శ్రీను, అన్నపూర్ణ దంపతుల కుమార్తె వెంకట రమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పావని దుర్గ, హర్ష సంతానం. సోమవారం భార్యాభర్తలిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో వెంకటరమణ అదే గ్రామంలో ఉండే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం మద్యం మత్తులో నరేష్ అత్తారింటికి వెళ్లి భార్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలిని పిప్పర పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. నిందితుడు నేరుగా గణపవరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గణపవరం ఎస్సై ఎం.వీరబాబు కేసు నమోదు చేశారు.