అనంతపురం జిల్లా తాడిపత్రిలో మెయిన్ బజార్లో ఈ ఏడాది జనవరి 28న జప్తు చేసిన 2.648 కిలోల బంగారు ఆభరణాలను సంబంధిత వ్యాపారులకు అందజేసినట్లుగా తాడిపత్రి డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. ఈ మేరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. నెల్లూరుకి చెందిన షేక్ షఫీ.. తాడిపత్రిలోని బంగారు దుకాణాదారుల కోరిక మేరకు నెల్లూరు నుంచి ఆభరణాలు తయారు చేయించి సరఫరా చేస్తుంటాడు.
ఇందులో భాగంగా జనవరి 28న దుకాణదారులకు డెలివరీ ఇచ్చేయందుకు 6 కిలోల ఆభరణాలు తీసుకుని తాడిపత్రికి వచ్చారు. బంగారు దుకాణదారుల అసోసియేషన్ భవనంలోని లాకర్లో 2.684 కేజీల ఆభరణాలు ఉంచి 2.5 కేజీల ఆభరణాలు తీసుకుని దుకాణం వద్దకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి షఫీ వద్ద నుంచి నగలు ఉన్న సంచిని లాక్కుని పరారయ్యారు. షఫీ వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు లాకర్ గదిలో ఉన్న 2.648 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. బంగారు అభారణాలకు సంబంధించిన బిల్లులు కేవలం 2.5 కిలోలకు మాత్రమే ఉండటం వల్ల 2.648 కిలోల ఆభరణాలను జప్తు చేసి అదాయపన్ను శాఖ అధికారులకు అందజేశారు.