దిశ హత్య కేసుకు పోలీసులు ముగింపు పలికారు. నవంబర్ 27 అర్ధరాత్రి నలుగురు కిరాతకులు షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పార్లమెంట్‌లోనూ దద్ధరిల్లింది. దిశ కేసులో నిందితులను తక్షణమే ఉరితీయాలనే డిమాండ్లు వెలువడ్డాయి.
సవాల్‌గా తీసుకున్న పోలీసులు
దిశ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నలుగురిని పట్టుకున్నారు. కిరాతకులను తక్షణమే ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చెర్లపల్లి రిమాండ్‌లో ఉన్న ఖైదీలను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస‌్తుండగా పారిపోయేందుకు నిందిలు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులు పారిపోతుండగా కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు.
హైకోర్టు అనుమతిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
దిశ ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అనుమతితో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. నెలరోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి కిరాతకులకు ఉరిశిక్ష పడేలా చూసేందుకు పోలీసులు దర్యాప్తును సైతం ముమ్మరం చేశారు.
నాలుగు బృందాలుగా ఏర్పడి
నాలుగు బృందాలుగా ఏర్పడి కేసులో ఆధారాలను సేకరిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కేసును సవాల్‌గా తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. నిన్న నిందితులు ఉపయోగించిన లారీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లిన క్లూస్‌టీంలు ఆధారాల కోసం ప్రయత్నించారు. బాధితురాలి చరవాణి కోసం వెతికారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా వేట ముమ్మరం చేశారు.