తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర లంచం కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరించింది అనిశా న్యాయస్థానం. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, వీఆర్‌ఏ సాయిరాజ్, స్థిరాస్తి వ్యాపారులు శ్రీనాథ్, అంజిరెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఈ నలుగురు నిందితులు గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని అనిశా తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో ఏకిభవించిన కోర్టు నిందితుల బెయిల్‌ను తిరస్కరించింది.
కీసర మండలం రాంపల్లి దాయరలో విలువైన భూమిని స్థిరాస్తి వ్యాపారులకు కట్టబెట్టేందుకు తహసిల్దార్ నాగరాజు రూ. కోటి 10 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఈ కేసులో నలుగురు నిందితులను అనిశా అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని నలుగురు నిందితులు గతవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.