ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన దుస్తులు, మహిళల చేతి సంచులు, గాజులు, 2 లక్షల బ్రిటిష్ పౌండ్లు పంపుతున్నామంటూ తెలంగాణలోని హైదరాబాద్ మహానగరం వనస్థలిపురానికి చెందిన ఓ వ్యక్తి(58) నుంచి సైబర్ నేరగాళ్లు 1.87 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ఈ తరహా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
విదేశీయుల పేరిట..
సైబర్ నేరగాళ్లు విదేశీయుల మాదిరిగా సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరుస్తారు. మీతో స్నేహం చేయాలని ఉందంటూ వల విసురుతారు. ఎక్కువ మంది ఇంగ్లాండ్‌కు చెందినవారంటూ పరిచయం చేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు, మూడు నెలల స్నేహం తర్వాత ఫోను నంబర్ తీసుకుంటున్నారు. బహుమతుల్ని పంపిస్తామని చెప్పి చిరునామా తీసుకుంటారు.
అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి..
చిరునామా ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత వాట్సాప్‌లో బహుమతుల ఫొటోలు, కొరియర్ రశీదు పంపిస్తారు. సదరు సంస్థకు చెందిన వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేసి రసీదుపై ఉన్న వివరాలను నమోదు చేయాలని సూచిస్తారు. కొరియర్ ఎక్కడి వరకొచ్చింది? ఎప్పుడు చేరే అవకాశముందనే వివరాలు కనిపిస్తున్న కారణంగా నమ్మకం కల్గుతుంది. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నామని.. కస్టమ్స్, ఇతరత్రా రుసుములు చెల్లిస్తే పార్సిల్ అందుతుందని చెబుతారు. ఒకటి, రెండ్రోజుల్లో చెల్లించకపోతే వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తారు. పలు దఫాలుగా రూ.లక్షల్లో కొల్లగొడతారు. అనంతరం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి స్పందన ఉండదు.