ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఉచితమేనని ఊరిస్తారు.. నమ్మితే ఉన్నదంతా ఊడ్చేస్తారు! - హైదరాబాద్ సైబర్ క్రైం కేసు

క్రెడిట్‌ కార్డు కావాలా.. డెబిట్‌ కార్డు తీసుకుంటారా.. అంటూ తరచూ కాల్స్‌ వస్తుంటాయి. ఉచితంగానే అంటున్నారు కదా అని ఆసక్తి చూపిస్తే సైబర్‌ కేటుగాళ్లు బ్యాంకులో ఉన్నదంతా ఊడ్చేయడం ఖాయం. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్​ సనత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే రూ.3 లక్షలు మోసపోయాడు. సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌ నగరంలో అతనిలాంటి బాధితులు భారీగానే ఉన్నారు. సక్రమంగా చేస్తున్నారో లేదో చూస్తామంటూ..

cyber-crime
cyber-crime

By

Published : Jul 1, 2020, 12:04 PM IST

ప్రముఖ బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నామంటూ పరిచయం చేసుకుంటారు. ఎలాంటి రుసుం లేకుండానే క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను జారీ చేస్తున్నామంటూ మాట కలుపుతారు. ఆసక్తి ఉందని అవతలివైపు నుంచి సమాధానం వచ్చిందంటే చాలూ.. ఇక రంగంలోకి దిగుతారు. మీరే స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చంటూ ఎనీ డెస్క్‌, క్విక్‌ సపోర్ట్‌, టీం వ్యూయర్‌ తదితర రిమోట్‌ యాప్‌లను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోమని సూచిస్తారు. మీరు సరిగా నమోదు చేస్తున్నారో లేదో ఇక్కడి నుంచి కంప్యూటర్‌లో చూస్తామంటూ వాటి యాక్సెస్‌(పిన్‌, ఐడీ నంబర్‌ తదితర సమాచారం) తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ బ్యాంకింగ్‌ తదితర యాప్‌లు ఉన్నాయా అని అడుగుతారు. ఒకవేళ లేకపోతే డౌన్‌లోడ్‌ చేసుకోమని చెబుతున్నారు.

రూపాయి నుంచి రూ.10 వరకు..

రూపాయి నుంచి రూ.10 వరకు బ్యాంకు నుంచి ఫోన్‌పే, గూగుల్‌ పే లేదా పేటీఎం వ్యాలెట్‌లోకి బదిలీ చేయమని సూచిస్తారు. చాలామంది ఇక్కడే మోసపోతున్నారు. మన వ్యాలెట్‌లోకే కదా పంపించేది అంటూ ముందుకువెనుకా ఆలోచించకుండా అడుగు ముందుకేస్తున్నారు. డబ్బు బదిలీకి క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నంబర్‌, పిన్‌, ఇతరత్రా సమాచారాన్ని నమోదు చేస్తుంటే ఎక్కడో ఉన్న కేటుగాళ్లు రిమోట్‌ యాప్‌ల సాయంతో చూస్తున్నారు. ఆ సమాచారం సాయంతో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. లావాదేవీలు జరిగినట్లు ఎస్‌ఎంఎస్‌లు వస్తుండటంతో బాధితులు లబోదిబోమంటూ బ్యాంకులను సంప్రదిస్తున్నారు.

అలాంటి ఫోన్‌కాల్‌ కట్‌ చేయండి

హైదరాబాద్​లో సైబర్‌ కేటుగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఫోన్‌ చేసి క్విక్‌సపోర్ట్‌, ఎనీ డెస్క్‌, టీం వ్యూయర్‌ తదితర యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోమంటే వెంటనే కాల్‌ కట్‌ చేయండి. ఎవరికీ మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇవ్వొద్దు.

- శ్రీనివాస్‌ కుమార్‌, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ

ఇదీ చదవండి :కొత్త 108, 104 వాహనాలను ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details