వారిద్దరికీ మూడేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కష్టించి చదివించిన అమ్మనాన్నలను, చెల్లెలిని చక్కగా చూసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో రానున్న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన చెల్లెలు దగ్గరకు వెళ్లి ఆమెకు కావాల్సినవి కొనిపెట్టాలని భార్యతో కలిసి వస్తుండగా ఆ దంపతులను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. వారి ఏడడుగుల బంధం మూడేళ్లకే ముగిసిపోగా, ఆ 2 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే...
ఉరవకొండలోని పాతపేటకు చెందిన ఇటుకల బాషా, అలీమాల కుమారుడు యూసుఫ్ (30).. గుంటూరు ఎస్‌బీఐలో ఉద్యోగి. అతడికి నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఫిరోజా (28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమె బళ్లారి జిల్లా కురుగోడు ఎస్‌బీఐలో ఉద్యోగిని. ఇద్దరూ కలిసి మంగళవారం ఉదయం బళ్లారిలోని యూసుఫ్ చెల్లెలు వద్దకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. కుడతిని సమీపంలో సిద్ధనహళ్లి గ్రామం వద్ద వారి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన ఇద్దరూ మృతిచెందారు. తనను చూడకుండానే అన్న, వదిన మృతిచెందడంతో అతడి చెల్లెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వారికి కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదే ప్రమాదంలో బళ్ళారికి చెందిన మరో వ్యక్తి మరణించాడు. ముందు కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా.... వెనకాల నుంచి మరో బైక్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.