ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

కంటైనర్లుకు కన్నం వేసి.. ఖరీదైన ఫోన్లను కొట్టేసే.. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 15 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చిత్తూరు జిల్లాలో దోపిడీ చేసిన 7 కోట్ల విలువైన సొత్తు కూడా ఉంది.

కంటైనర్లే టార్గెట్.
కంటైనర్లే టార్గెట్.

By

Published : Sep 29, 2020, 8:47 PM IST

Updated : Sep 30, 2020, 12:37 PM IST

కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!

భయంకర బందిపోట్ల వేట...! కంటికి కనిపించని వైరస్‌తో బయటకు కనిపించని యుద్ధం....! గుర్తింపు బట్టబయలు కాకుండా రోజుల తరబడి మారువేషం...! వెరసి... దోచుకోవడమే తప్ప పట్టుబడటమే తెలియని కరుడుగట్టిన గజదొంగలకు.. ఆంధ్రా పోలీసుల దెబ్బ రుచి తెలిసొచ్చింది. మధ్యప్రదేశ్‌ పోలీసుల సాయంతో 7 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకునేలా ఏపీ పోలీసులు చూపించిన తెగువ.... 'ఖాకీ' సినిమాను తలపిస్తోంది.

కంజర్‌భట్‌లు....! దేశంలోనే పేరుమోసిన గజదొంగల ముఠా. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌, రాజస్థాన్‌లో ఉంటూ.. పొరుగు రాష్ట్రాల్లో హైవేలపై రెక్కీ నిర్వహించి దోచుకోవడమే వీరి ఆదాయ వనరు. భారీ లోడ్‌తో వెళ్లే కంటైనర్‌ వెంటపడి.. అనువైన చోటు చూసుకుని దాన్ని ఆపుతారు. డ్రైవర్‌ను బెదిరించి సరకును తస్కరిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ నెల వ్యవధిలో జరిగిన రెండు భారీ చోరీలు ఒకేలా ఉండటంతో.. వారిని అనుమానిస్తూ దర్యాప్తు చేపట్టిన ఖాకీలు.. ఎట్టకేలకు సఫలీకృతమై వారి స్థావరంలోనే అరెస్ట్ చేశారు.

ఆగష్టు 25 అర్ధరాత్రి దాటాక తమిళనాడు శ్రీ పెరంబూరు నుంచి ముంబై వెళ్తున్న సెల్‌ఫోన్‌ కంటైనర్‌ను అనుసరించిన కంజర్‌భట్‌లు.. డ్రైవర్‌ను కట్టేసి 7 కోట్ల విలువైన సరకు కాజేశారు. కొన్నిరోజులకే చిలకలూరిపేట-గుంటూరు మార్గంలోని హైవేపైనా ఇదే తరహాలో 81లక్షల విలువైన చోరీ జరిగింది. రెండు ఘటనలూ ఒకే తరహాలో ఉండటంతో.. పోలీసులకు కంజర్‌భట్‌లపై అనుమానం వచ్చింది. ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తూ ఉండే కంజర్‌భట్‌లను పట్టుకోవడం అసాధ్యమనే భావన ఉండగా.. ఏపీ పోలీసులు దాన్ని తిరగరాశారు.

చిత్తూరు జిల్లా నగరి పోలీస్‌స్టేషన్‌లో ఆగష్టు 27న చోరీ కేసు నమోదవగా.. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలతో పీలేరు సీఐ సాదిక్ అలీ, మరో ఎస్​ఐతో కలిసి మహారాష్ట్ర, రాజస్థాన్‌, బిహార్‌ రాష్ట్రాల్లో గాలించిన తర్వాత.. చోరీ చేసింది మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ ప్రాంతానికి చెందిన ముఠాగా నిర్ధరణకు వచ్చారు. ఓ బృందంగా ఏర్పడి అక్కడి క్రైం రికార్డులను పరిశీలించారు. అక్కడ్నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చినవారి కూపీ లాగారు. ఈ దర్యాప్తులో కొందరికి కరోనా సోకినా.. వారికి వైద్యసాయం అందిస్తూనే.. అక్కడి పల్లెలను, అటవీప్రాంతాలను సోదా చేశారు. పోలీసులనే అనుమానం రాకుండా 15 రోజుల పాటు మారువేషాల్లో తిరుగుతూ.. ఎట్టకేలకు మన రాష్ట్రంలో జరిగిన చోరీతో సంబంధమున్న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. దేవాస్‌ ప్రాంతంలో వేర్వేరు చోట్ల దాచిపెట్టిన 7 కోట్ల విలువైన ఫోన్లను రికవర్ చేశారు.

మహరాష్ట్రకు చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ రామ్ గాఢే.. కంజర్ గ్యాంగ్ తో కలిసి ఈ స్కెచ్ వేశాడు. దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ల చోరీకి పథకం వేశాడు. దొంగిలించిన ఫోన్లకు ఐఏంఈఐ నెంబర్లను మార్చి.. ఆ తర్వాత బ్లాక్ మార్కెట్​లో విక్రయించేవారు.

చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాలతో... చోరీ ఘటనలపై దేశంలోని వివిధ ముఠాల గురించి దర్యాప్తు చేశాం. దేవాస్‌కు చెందిన కంజర్‌భట్‌లు దీని వెనుక ఉన్నారని తేలింది. దేవాస్‌ ఎస్పీతో సమావేశమై కేసు వివరాలన్నీ తెలియజేశాం. వారు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి సహకారంతో 15 రోజుల పాటు గాలించి ముగ్గురిని అరెస్ట్ చేశాం. రూ.7 కోట్ల విలువైన సరకు స్వాధీనం చేసుకున్నాం.- సాదిక్ అలీ, పీలేరు సీఐ

రామ్‌గడే, అంకిత్‌, రోహిత్ అనే ముగ్గురిని అరెస్ట్‌ చేశాం. చోరీలో భాగమున్న మరికొందరు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం గాలింపు చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రల్లో వీళ్లు అనేక దొంగతనాలు చేశారు. ఈ చోరీలో ప్రధాన సూత్రధారి రామ్‌గడే. ఇతను పుణెకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.- శివదయాళ్ సింగ్, దేవాస్‌ ఎస్పీ

కంజర్‌భట్‌లలో పెళ్లి చేయాలన్నా సరే... వరుడికి ఉండాల్సిన ఏకైక అర్హత దొంగతనమే అంటే.. వారిలో నేరస్వభావం ఎంతలా పాతుకుపోయిందో అర్థమవుతోంది. ఇంతటి గజదొంగల ముఠాను కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లోనూ పట్టుకున్న సాదిక్ అలీ బృందం.. పలువురి ప్రశంసలు అందుకుంటోంది. దేవాస్‌ న్యాయస్థానంలో నిందితులను ప్రవేశపెట్టిన పోలీసులు.. ఒకట్రెండు రోజుల్లో కస్టడీలోకి తీసుకోనున్నారు.

--

ఇదీ చదవండి:

ఈ లింక్​పై క్లిక్ చేయండి.. మన సీతాకోక చిలుకను గెలిపించండి

Last Updated : Sep 30, 2020, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details