ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎంవీఎస్ఎస్ వరప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారంతో విజయవాడ కరెన్సీనగర్లోని ఆయన ఇంటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి జరిపిన తనిఖీల్లో ఇప్పటివరకు విజయవాడలో లోటస్ పార్క్ లో జీప్లస్ ఇల్లు, కరెన్సీ నగర్ లో జీ ప్లస్ టు ఇల్లు, హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్లో ప్లాట్, కంచికచర్ల వద్ద 400 గజాలు, జక్కంపూడిలో 400 గజాల స్థలం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట మండల వన్నూరులో 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.
వీటితో పాటు రూ.50లక్షల విలువ చేసే ఫిక్స్ డ్ డిపాజిట్, బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షల నగదు, ఇంట్లో 218 గ్రాముల బంగారం, 1.25 లక్షల రూపాయల నగదు గుర్తించామని అధికారులు తెలిపారు. వీటితో పాటు కార్పొరేషన్, కెనరా బ్యాంక్లో రెండు లాకర్లు ఉన్నట్లు నిర్థరించామన్నారు. లాకర్లను త్వరలోనే తెరుస్తామని తెలిపారు. ప్రస్తుతం వరప్రసాద్ గుంటూరులోని ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.