చదివింది బీటెక్.. చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. భర్తను కోల్పొయి, విడాకులు తీసుకుని రెండో పెళ్లికోసం మ్యాట్రిమోనిలో దరఖాస్తు చేసుకున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. తియ్యని మాటలతో పరిచయం చేసుకుని.. నేరుగా ఇంటికి వెళ్లి మాటలతో ఆకర్షిస్తాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..శారీరకంగా లోబరుచుకుంటాడు. ఆపై లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నయ వంచకుడిని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రూ.12.20లక్షలు వసూలు చేశాడు...
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన జగ్గవరపు ప్రదీప్‌కుమార్‌కు 2017లో వివాహం జరగ్గా.. 2019లో విడాకులు తీసుకున్నాడు. అనంతరం మ్యాట్రిమోని సైట్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అందులో ఉండే అందమైన అమ్మాయిల ఫోటోలు, వివరాలను సేకరిస్తాడు. తనకు నచ్చిన అమ్మాయిలను చూసి.. వారికి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుంటాడు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ మహిళ రెండో వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో తన వివరాలు నమోదు చేసింది. ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాగా దగ్గరైన తర్వాత ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితి బాగలేదని చెప్పాడు. అప్పుగా కొంత మొత్తం ఇస్తే.. కొద్ది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ ఆమెను నమ్మించాడు. పలు దఫాలుగా ఆమె దగ్గర నుంచి రూ.12.20 లక్షలు వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని మహిళ తిరిగి ఇవ్వాలని కోరడంతో.. తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి ఆ యువతి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.