పట్టపగలే తలుపులు తాళాలు పగలగొట్టి చోరీలు చేసే మహిళను గుంటూరు జిల్లా బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల టౌన్‌లోని భీమా వారి పాలెంలో నివసించే శివరాం ప్రసాద్ అక్టోబర్ 29న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఫంక్షన్‌కి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలం కొనేందుకు పోగేసుకున్న రూ.16 లక్షల నగదు, బంగారు నగలు బీరువాలో పెట్టి తాళం వేశాడు.
తిరిగి వచ్చేసరికి..
సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి వెనుక ఉన్న తలుపు పగులగొట్టి ఉంది. నివాసంలోకి చొరబడిన దొంగలు రూ.16 లక్షల సొమ్ము, బంగారు నగలను చోరీ చేసినట్లు గుర్తించారు. బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.
వేలిముద్రల ఆధారంగా..
చినరావూరుకి చెందిన శీలం దుర్గ ఈ చోరీ చేసినట్టు పోలీసులు వేలిముద్రల ఆధారంగా నిగ్గు తేల్చారు. నిందితురాలిని అరెస్టు చేసి.. మొత్తం రూ. 15.37 లక్షల నగదు, 9 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
గతంలోనూ ఘనమే..
తెలంగాణలోని ఘట్ కేసర్ ప్రాంతంలో గతంలోనూ 3 దొంగతనాలు చేసిన నేర చరిత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దొంగతనాలకు సంబంధించి 60 శాతం రికవరీ చేశామని వివరించారు. నిందితురాలు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి లాగా సంచరిస్తూ.. తాళాలు వేసిన గృహాలను గుర్తించి దొంగతనాలు చేస్తుందని డిఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి:
అనంతలో యువతి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు