వరుణుడి బీభత్సం... హైదరాబాద్‌లో పది మంది దుర్మరణం - పాతబస్తీలో ఇళ్లు కూలి 8 మంది మృతి వార్తలు
00:12 October 14
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలు పది మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. పాతబస్తీలో రాత్రి సమయాన ప్రహారీ కూలి 8 మంది మరణించారు. ఇబ్రహీంపట్నంలో భారీ వర్షాలకు పెంకుటిల్లు పైకప్పు కూలి ఇద్దరు మృతి చెందారు.
హైదరాబాద్ నగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షం పది మందిని మింగేసింది. పాతబస్తీలో రాత్రి సమయాన ప్రహారీ కూలి 8 మంది దుర్మరణం చెందారు. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ గౌస్‌నగర్ (వీకర్ సెక్షన్ కాలనీ)లో మహమ్మద్ పహిల్వాన్ సంబంధించిన ఖాళీ స్థలముంది. ఆ స్థలాన్ని లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తూ గ్రానైట్ రాళ్లతో ప్రహారీ నిర్మించారు. రాత్రి 11 గంటల సమయంలో గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా పక్కనే ఉన్న నివాసాలపై పడిపోయాయి. దీంతో 8 మంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో రెండు నెలల పసిపాపతోపాటు మరో చిన్నారి, ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 11 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
భారీ వర్షాలకు పెంకుటిల్లు పైకప్పు కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్‌శెట్టి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన క్యామా సువర్ణ(40), ఆమె కుమార్తె స్రవంతి(15), కుమారుడు సంపత్‌తో కలిసి రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్నారు. అదే సమయంలో భారీ శబ్దంతో ఇంటి పైకప్పు, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో శిథిలాల కింద చిక్కుకుని సువర్ణ, స్రవంతి అక్కడికక్కడే మరణించారు. సంపత్ గాయాలపాలయ్యాడు. పోలీసులు, స్థానికులు సంపత్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు.