కొవిడ్ బాధితుల ఆరోగ్యం మెరుగుపర్చడానికి ఆసనాల అస్త్రం సంధిస్తోంది గుంటూరు జిల్లా యంత్రాంగం. కొవిడ్ కేరే సెంటర్లలో యోగా పాఠాలు చెప్పిస్తోంది. పతంజలి యోగా గురువు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ తరగతులు జరుగుతున్నాయి. ముందుగా జీవన విధానం ఎలా ఉండాలో చెబుతారు. అంటే సూర్యోదయానికి ముందు లేవటం, ఎక్కువగా నీరు తాగటం, రోజుకు రెండు లీటర్ల మేర మూత్ర విసర్జన చేయటం, వీలైతే మూడు పూటలా మల విసర్జనకు వెళ్లాలని సూచిస్తారు. అలాగే ఆహార ధర్మం గురించి వివరిస్తారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవటం ఎలాగో అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు శ్వాస ప్రక్రియ సజావుగా సాగేలా ప్రాణాయామాలు, శారీరక ధృడత్వం కోసం సూర్య నమస్కారాలు, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం నేర్పిస్తున్నారు. వ్యాధి బారిన పడ్డామన్న ఆందోళనలో ఉన్న వారికి ఇవన్నీ ధైర్యాన్ని ఇస్తాయని యోగా గురువు శ్రీనివాస్ తెలిపారు.
నాలుగు నెలలుగా నిర్వహణ
వారం రోజుల పాటు నిత్యం దాదాపు గంటన్నర పాటు యోగా తరగతులు సాగుతాయి. ఆ తర్వాత వేరే కేంద్రంలో మరో వారం రోజులు నిర్వహిస్తారు. ఇలా గుంటూరుతో పాటు నర్సరావుపేట, తెనాలి కొవిడ్ కేంద్రాల్లోనూ గత నాలుగు నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వెంటనే ఎంతో ఆవేదనతో ఉన్న తమకు యోగా తరగతులు స్వాంతన చేకూర్చాయంటున్నారు బాధితులు. శ్వాస సమస్యలు, ఒంటి నొప్పులు దూరమయ్యాయని తెలిపారు. తాము కోలుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా యోగా చేయటం కొనసాగిస్తామని చెప్పారు.