తెలంగాణ దుబ్బాక ఉపఎన్నికల ఫలితం తెరాసను కొంత నైరాశ్యంలో పడేసింది. అ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ భాజపా పుంజుకున్న తీరు అధికార పక్షానికి మేల్కోవాలనే సంకేతాలిచ్చింది. అంతా బాగుందనే పరిస్థితి నుంచి తేరుకున్న గులాబీదళం.. అన్ని ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని భావించింది. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అది తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లోనూ సమష్టిగా పనిచేసి విజయదుందుబి మోగించారు. నిరుద్యోగులు, మేధావుల ఓటు బ్యాంకు రాబట్టడం కష్టమే అనే అంచనాలను తలకిందులు చేసి రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లో అభ్యర్థి కరువు అనే పరిస్థితిని తిరగరాసి పీవీ కుమార్తె సురభివాని దేవిని గెలిపించి విపక్షాలకు షాక్ ఇచ్చింది. సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం మరోసారి పట్టభద్రుడిగా ఎన్నికయ్యారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం.. దుబ్బాక ఉపఎన్నిక అనూహ్య ఓటమి.. జీహెచ్ఎంసీ ఫలితాల నిస్పృహ నుంచి బయటపడేసింది. ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ ప్రకటన.. నిరుద్యోగ భృతి అమలు చేస్తామనే ప్రకటనలు అధికారపక్షానికి లాభించేలా చేశాయి.
ముఖ్యమంత్రి సభలు
ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న తెరాస నాగార్జునసాగర్ ఉపఎన్నికలపై దృష్టిపెట్టింది. నోటిఫికేషన్‌కు ముందే ఆ ప్రాంత ప్రజల మనసులు చూరగొనేందుకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాల శ్రీకారం చుట్టారు. సాగర్ ప్రాంతాన్ని సస్యశ్యామంలే చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వల్లే నాగార్జునసాగర్ చెంతనే ఉన్నా ఇక్కడి భూములు బీళ్లుగా మారాయని బహిరంగ సభతో ఎండగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో జల దోపిడీని కాంగ్రెస్ నేతలు అరికట్టలేక పోయారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. రైతు బంధు, బీమా, రుణమాఫీ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం సాగర్ నోటిఫికేషన్ తర్వాత కూడా మరోసారి హాలియా బహిరంగ సభతో అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి సీఎం దూరంగా ఉండగా ఫలితం చేజారింది. ఈసారి అలాంటి అవకాశానికి తావివ్వకుండా సీఎం కేసీఆర్ బహిరంగ సభతో భరోసా ఇచ్చారు.
భాజపా ఆరోపణలు