ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / headlines

ARREST IN VIZIANAGARAM : బాలికలపై లైంగిక దాడి నిందితుడిని.. రాత్రికి రాత్రే పట్టుకున్న పోలీసులు

బాలికలపై లైంగిక దాడి ఘటనలో నిందితుడిని.. విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ దీపిక వెల్లడించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అత్యాచారం ఘటన వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ దీపిక
అత్యాచారం ఘటన వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ దీపిక

By

Published : Jan 2, 2022, 10:53 PM IST

Updated : Jan 3, 2022, 3:22 AM IST

నూతన సంవత్సరం సందర్భంగా.. కురుపాంలోని బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థినులు బయటకు వెళ్లారు. జియ్యమ్మవలస మండలం రేగడి వద్ద విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. రాంబాబు అనే వ్యక్తి తాను పోలీసునని నమ్మించి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని అభియోగం నమోదైంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ దీపిక వెల్లడించారు. నిందితుడిపై గతంలో 13 కేసులు ఉన్నాయని, ప్రస్తుతం ఐపీసీ 376, 506 సెక్షన్​లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.

దిశ యాప్​తో సత్వర న్యాయం..
ప్రతి ఒక్కరూ దిశ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని ఎస్పీ దీపిక సూచించారు. బాలికలు, యువతులు, మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా.. యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, తద్వారా వెంటనే సహాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశానికి ముందు ఎస్పీ దీపిక బాధిత బాలికను పరామర్శించారు.

కురుపాంలో గిరిజన బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై అందిన ఫిర్యాదుతో వెంటనే విచారణ చేపట్టాం. ఈ మేరకు నిన్న రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. నిందితుడిపై గతంలో 13 కేసులు ఉన్నాయి. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం. -దీపిక, విజయనగరం జిల్లా ఎస్పీ

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం :ఉప ముఖ్యమంత్రి
పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పరామర్శించారు. కొత్త సంవత్సరం రోజున ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. నిందితుని వాహనంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటించుకున్నాడని, వైకాపా పార్టీకి చెందిన వ్యక్తిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని ఆమె అన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్​లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

తెదేపా నాయకుల పరామర్శ..
గిరిజన బాలికలను తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బిలి చిరంజీవులు బాధితులతో మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల వారికి రక్షణ లేకుండా పోయిందని తెదేపా నేతలు ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తేదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 3, 2022, 3:22 AM IST

ABOUT THE AUTHOR

...view details