తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి వారం రోజుల పాటు తిరుపతి ఉపఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం రానున్న చంద్రబాబు.... రోడ్డు మార్గంలో ఉదయం తొమ్మిది గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. పది గంటల వరకు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం రేణిగుంట పాత చెక్‌పోస్ట్ సమీపంలోని వై కన్వెన్షన్ సెంటర్‌లో ఉప ఎన్నికలపై నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు... తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
బి.పి.అగ్రహారం, సూపర్ బజార్, పెళ్లి మండపం మీదుగా బేరివారి మండపం వరకు ప్రచారం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయం వద్దే బస్సులో బసచేస్తారు. 9వ తేదీన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, 10వ తేదీన సూళ్లూరుపేట, 11వ తేదీన వెంకటగిరి, 12న సత్యవేడు, 13న గూడూరు, 14వ తేదీన తిరుపతి లో జరిగే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు.