ప్రచార మైదానంలో మిగిలింది...రెండు బంతులే! - undefined
ఆంధ్రా ఎన్నికల పోరు చివరి ఓవర్‌కు వచ్చేసింది....ఇక మిగిలింది రెండు బంతులే...నువ్వా నేనా అంటూ తలపడుతున్న పొలిటికల్ ఐపీఎల్‌లో... రాజకీయ జట్లు...ప్రత్యర్థి జట్లపై గెలిచేందుకు కాలు దువ్వుతున్నాయి . ప్రచార ఘట్టాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. రెండు బంతులే ఉండటంతో...ఇప్పటికీ మించిందేమీ లేదంటూ గెలిచేందుకు సర్వశక్తులా...ప్రచార మైదానంలో ప్రయత్నిస్తున్నాయి.
సార్వత్రిక సమరంలో పోలింగ్ ఘట్టానికి సమయం దగ్గరపడింది. నేతల్లో గుబులు పెరుగుతోంది. ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు... తెల్లవారి వెలుగులా... ఊళ్లల్లో అడుగుపెట్టేస్తున్నారు. భానుడి ప్రతాపానికి చెమటలు కక్కుతున్న అలుపెరగకుండా...ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పోలింగ్‌కు 2రోజులే ఉన్నందున అన్ని పార్టీలూ...ప్రచార జోరు పెంచాయి. గుట్టుచప్పుడు కాకుండా...ఓటర్లకు నేతలు గేలం వేస్తున్నారు. పగలంతా ప్రచార మోత మోగించి...రాత్రైతే...తెర వెనక మంతనాలు చేస్తున్నారు.
సైకిల్ దూకుడు
ప్రచారంలో తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే జిల్లా పర్యటనల్లో అధినేత చంద్రబాబు అలుపెరగకుండా ప్రచారం చేశారు. యువకుడిలా...అలుపు అనేది లేకుండా తిరిగేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలతో పోటీ పడుతూ...ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి ట్రెండీగా మైక్ వాడుతూ...హావభావాలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా...ప్రచారాన్ని సాగిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లంతా...రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారు. ఇక 2రోజులే ఉండటంతో..సైకిల్ పార్టీ ప్రచార జోరు పెంచింది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మంత్రులు సైతం నియోజకవర్గాల్లో తిరుగుతూ అభివృద్ధే అస్త్రంగా ముందుకు సాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు...ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉదయమే...ప్రచారం షురూ చేసేస్తున్నారు.
పెరిగిన 'ఫ్యాన్' గ్యాలి...
ఎన్నికల శంఖారావం మోగక ముందు నుంచే ప్రజల్లో ఉన్న వైకాపా అధినేత జగన్...నగారా... మోగాక తీరిక లేకుండా ఉన్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ... ప్రచారంలో నిమగ్నమయ్యారు. మధ్యలో కాస్త ఇబ్బందికలిగినా... అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే తపనతో మళ్లీ ప్రచార రథమెక్కారు. నవరాత్నలు, మేనిఫెస్టోలో చెప్పిన హామీలతో ముందుకు సాగుతున్నారు. 2రోజులే మిగిలి ఉండటంతో ప్రచారంలో...ప్రభుత్వంపై విమర్శల ఘాటు పెంచారు. సినీ తారాలను ప్రచారంలో దించి ప్రచార హీట్ పెంచారు. వైకాపా అభ్యర్థులంతా...ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ...ఓటర్లను దర్శించుకుంటున్నారు. ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదంటూ... విస్తృతంగా పర్యటిస్తున్నారు.
డోస్ పెంచిన గ్లాసు...
సుడిగాలి పర్యటనలతో...ప్రసంగాలతో జోరుమీదున్న పవన్..ఇంకాస్త డోస్ పెంచారు. మెున్న కాస్త అస్వస్థత తర్వాత మళ్లీ...ప్రచార బరిలో దూకేశారు. ఆవేశభరిత ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. గెలుపు ప్రభావితం...చేసే తటస్థ ఓటర్లను పార్టీ కార్యకర్తలు వెళ్లి కలుస్తున్నారు. పార్టీ విధానాలు వివరిస్తూ...ముందుకు సాగుతున్నారు. బహిరంగ సభలు, రోడ్‌షోలతో ప్రజలతో మమేకమవుతున్నారు. బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులో భాగంగా...బీఎస్పీ అధినేత్రి మయావతినీ ప్రచారానికి రప్పించారు పవన్. ఇక చివరి 2బంతులు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని దూకుడు పెంచారు.
హస్తం, కమలం...ప్రచారాలు
3 పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండటంతో...జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా...గెలవాలని ఆరాటపడుతున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి భాజపా ప్రచారం చేయించింది. రాష్ట్ర నాయకులు సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సభలతో నేతల్లో జోష్ నింపింది. రాష్ట్ర నేతలిప్పుడు ప్రచార జోరు పెంచారు.
ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒకెత్తైయితే ఈ 2రోజుల్లో జరుగుతున్న ఉద్ధృత ప్రచారం మరోవైపు. ఓటర్ల జాబితా పట్టుకుని పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఓట్లు అభ్యర్థించడంతోపాటు... పోలింగ్ బూత్‌ల వివరాలు, ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు తెలియజేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఓటుకు ఇంత అంటూ బేరాలు సాగిస్తున్నారు. ప్రత్యేర్థులు ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తామంటూ ఓటర్లకు గేలం వేస్తున్నారు.
TAGGED:
2019 ap elections