ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

పురపాలక ఎన్నికల్లో ముగిసిన మరో ఘట్టం

పురపాలక ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తైంది. పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలికలు వైకాపా సొంతమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కృష్ణా జిల్లా తిరువూరు పురపాలికలో ఆఖరి నిమిషంలో హైడ్రామా నడిచింది.

పురపాలక ఎన్నికల్లో ముగిసిన మరో ఘట్టం
పురపాలక ఎన్నికల్లో ముగిసిన మరో ఘట్టం

By

Published : Mar 3, 2021, 8:28 PM IST

నగర, పురపాలికల్లోని.. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మంగళ, బుధవారం రెండు రోజుల గడువు ఇచ్చింది. తొలిరోజు 2వేల 472మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు వివిధ పురపాలికల్లోనూ అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కుతీసుకున్నారు.

నూజివీడు పురపాలికలో 151 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో 78 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పట్టణంలోని 32 వార్డులలో ఇద్దరు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 55 మంది బరిలో నిలిచారు.

కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ ఎన్నికల్లో 23 వార్డుల్లో 47 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తిరువూరు పురపాలికలో ఆఖరి నిమిషంలో హైడ్రామా నడిచింది. సమయం ముగిసిన తర్వాత వైకాపా నాయకులు భాజపా అభ్యర్థిని బలవంతంగా నామినేషన్ ఉపసంహరణకు తీసుకెళ్లారు. పోలీసులే దగ్గరుండి మున్సిపల్ కార్యాలయంలో భాజపా అభ్యర్థిని పంపించారని తెదేపా నాయకులు ఆరోపించారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని 38 వార్డుల్లో... 3 వార్డుల్లో వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. తెనాలి మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపల్లె మున్సిపాలిటీలో మూడు వార్డులు వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. పల్నాడులో పురపాలక ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల జోరుకొసాగింది. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు వైకాపాకు ఏకగ్రీవమయ్యారు. పిడుగురాళ్లలో 33 వార్డుల్లో వైకాపా అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సంఘం వైకాపా సొంతమైంది. ఇక్కడి 31 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. ప్రత్యర్థుల నామినేషన్‌లు లేకపోవటంతో పుంగనూరు పురపాలక సంఘం వైకాపాకి ఏకగ్రీవమైంది. పలమనేరు పురపాలక సంఘంలోని 26 వార్డుల్లో 18 వార్డులు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. నగరి పురపాలక సంఘం పరిధిలోని 29 వార్డుల్లో 7వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 6వార్డులు వైకాపా అభ్యర్థులు, 1వార్డు తెదేపా అభ్యర్థికి ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 22వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

ప్రకాశం జిల్లా అద్దంకిలో నాటకీయ పరిణామలు చోటుచేసుకున్నాయి. ఎనిమిదో వార్డులో వైకాపా, తెలుగుదేశం అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఇక్కడ ఎన్నిక లేనట్లేనని చెబుతున్నారు. మార్కాపురం పురపాలక సంఘంలోని 35 వార్డుల్లో నాలుగు ఏకగ్రీవమయ్యాయి. ఈ నాలుగు వార్డులు వైకాపా సొంతమయ్యాయి. కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులకు గాను మొదటి రోజు 5 వార్డులు, రెండో రోజు 2 వార్డులు మొత్తం 7 వార్డులు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 13 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయి. గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులలో 7 వార్డులను వైకాపా సొంతం చేసుకుంది.

విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో మూడు వార్డులు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో 41 వార్డులు ఉండగా 9 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు నగరపాలిక 34,35 వార్డులు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో 59 మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 30 వార్డులకు 82 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుని పురపాలక సంఘంలో 30 వార్డులకుగాను 15 వార్డులు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 15 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండీ... మున్సిపోల్స్: నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details