మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 73వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి వరసగా రెండోరోజు హాజరయ్యారు. నిన్న ఇద్దరినీ ప్రశ్నించిన సీబీఐ అధికారులు..ఇవాళ మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల వైకాపా ఇంఛార్జ్ కాగా..మనోహర్‌రెడ్డి పులివెందుల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
వివేకా హత్య జరిగిన తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 20 మంది ఘటనా స్థలంలో ఉన్నారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఆరోజు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. వీరికంటే ముందుగానే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ విచారణకు వెళ్లారు.