BDS STUDENT MURDER : గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో దారుణం చోటుచేసుకుంది. బీడీఎస్ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థిని తపస్విపై జ్ఞానేశ్వర్ అనే యువకుడు దాడి చేశాడు. సర్జికల్ బ్లేడ్‌తో యువతి గొంతు కోశాడు. తీవ్రగాయాలైన బాధితురాలు గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తపస్విపై దాడి చేసిన తర్వాత యువకుడు తన చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
సామాజిక మాధ్యమాల్లో పరిచయం: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వి.. విజయవాడలోని ఓ వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతోంది. ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులు ముంబయిలో ఉంటుండగా.. మేనత్త దగ్గర ఉంటూ కళాశాలకు వెళ్లుతోంది. ఆమెకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జ్ఞానేశ్వర్‌తో సామాజిక మాధ్యమంలో పరిచయమైంది. వీరిద్దరూ కొంతకాలం గన్నవరంలో ఉన్నారు. ప్రేమ విషయమై విభేదాలు రావటంతో అతడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా అతడి నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తక్కెళ్లపాడులో ఉంటున్న తన స్నేహితురాలికి చెప్పి బాధపడింది.