ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి.. నదిలో శవం.. అసలేమైంది..!

YOUNG WOMAN DIED IN KADAPA : వైఎస్సార్​ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజులు కిందట కళాశాల నుంచి అదృశ్యమైన యువతి....ఆదివారం ఉదయం సిద్ధవటం వద్ద పెన్నా నదిలో శవమై తేలింది. బద్వేల్‌ మండలానికి చెందిన గురు మహేశ్వర్‌రెడ్డి అనే యువకుడితో పాటు మరికొందరు కలిసి...అనూషను చంపేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

YOUNG WOMAN DIED IN KADAPA
YOUNG WOMAN DIED IN KADAPA

By

Published : Oct 23, 2022, 3:54 PM IST

Updated : Oct 24, 2022, 6:31 AM IST

YOUNG WOMAN DIED : వైఎస్సార్​ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష ఈనెల 20 తేదీన బద్వేల్‌ ప్రైవేటు కళాశాల నుంచి అదృశ్యమైంది. పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే.. సిద్ధవటం మండలం జంగాలపల్లి వద్ద పెన్నా నదిలో అనూష శవమై కనిపించింది. మృతదేహం తమ కుమార్తెదేనని అనూష తల్లిదండ్రులు గుర్తించారు. మృతదేహంపై తలపైన వెంట్రుకలు ఊడిపోయి ఉండడం.. మొహానికి ఒకవైపు కాలినట్లు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ బద్వేల్‌ మండలం పాపిరెడ్డి పల్లెకు చెందిన గురుమహేశ్వర్‌రెడ్డి కారణమని అనూష తల్లిదండ్రులు సిద్ధవటం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురుమహేశ్వర్‌రెడ్డి, అనూష ఇద్దరూ బద్వేల్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నారు. ఈనెల 20వ తేదీన గురు మహేశ్వర్‌రెడ్డి, అనూషతో పాటు మరో నలుగురు యువకులు కలిసి సిద్ధవటం కోటకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. సిద్ధవటం కోటకు వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనూష తల్లిదండ్రుల ఫిర్యాదుతో గురు మహేశ్వర్‌రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల తీరుపై అనూష కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
కేసుపై దర్యాప్తు జరుగుతోందన్న డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌..గురు మహేశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Last Updated : Oct 24, 2022, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details