శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పుల్లాయపల్లె గ్రామానికి చెందిన నజ్మా(18) అనే యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా..ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్న యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
గ్రామానికి చెందిన నజ్మా, ఇమామ్ ఖాసీం ఒకరినొకరు ఇష్టపడ్డారు. నజ్మాను పెళ్లి చేసుకుంటానని ఇమామ్ ఖాసీం నజ్మా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆదివారం రాత్రి పశువులకు మేత వస్తానని చెప్పి.. నజ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఉదయాన్నే వెతికారు. గ్రామ సమీపంలో ఉండే పంట పొలాల్లోని బావి వద్ద పాదరక్షలు, చున్నీ ఉండడంతో ఆమె బావిలో దూకి ఉంటుందని భావించారు. స్థానికుల సహాయంతో నజ్మా మృతదేహం కోసం బావిలో వెతికి.. సాయంత్రానికి బయటికి తీశారు.