ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వ్యాపారి నిర్లక్ష్యం.. మంచినీరు అనుకుని యాసిడ్‌ తాగిన యువకుడు!! - విజయవాడ తాజా వార్తలు

ఒకరి నిర్లక్ష్యం ..మరొకరికి ప్రాణాపాయంగా మారింది. దాహంగా ఉందని మంచినీళ్లు అడిగితే ఆ షాపు యజమాని నిర్లక్ష్యంగా ఫ్రిజ్​లో నుంచి తీసుకోమన్నాడు. అయితే ఆ విద్యార్థి మంచినీళ్ల సీసాకు బదులుగా పక్కనే ఉన్న యాసిడ్‌ సీసాను తీసుకుని తాగాడు. వెంటనే వాంతులు చేసుకోవడంతో స్నేహితులు అతనిని సమీపంలో ఉన్న క్లినిక్‌కి తీసుకెళ్లగా.. యాసిడ్‌ తాగినట్లు ధ్రువీకరించారు. విజయవాడ నగరంలోని ఎనికేపాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

young man drink acid
మంచినీరు అనుకుని యాసిడ్‌ తాగిన యువకుడు

By

Published : Apr 18, 2022, 9:06 AM IST

వ్యాపారి నిర్లక్ష్యంతో మంచినీరు అనుకుని యాసిడ్‌ తాగిన ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విజయవాడ నగరంలోని ఎనికేపాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. "కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన కోసూరు చైతన్య.. విజయవాడ లయోలా కళాశాలలో ఏవియేషన్‌ విభాగంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కేసరపల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14న చైతన్య.. ఎనికేపాడులో ఉన్న తన స్నేహితుల గదికి వచ్చాడు. సమీపంలో ఉన్న కూల్‌డ్రింక్‌ షాపునకు వెళ్లి మంచినీరు సీసా అడుగగా.. ఫ్రిజ్‌లో ఉంది తీసుకోమని వ్యాపారి తెలిపారు. దీంతో చైతన్య.. ఫ్రిజ్‌లో మంచినీరు సీసా పక్కనే ఉన్న యాసిడ్‌ సీసాను తీసుకుని తాగాడు. మంచినీటి సీసా వలే యాసిడ్‌ సీసా ఉండటంతో గమనించలేదు. వెంటనే వాంతులు చేసుకోవడంతో స్నేహితులు అతనిని సమీపంలో ఉన్న క్లినిక్‌కి తీసుకెళ్లారు. అక్కడ యాసిడ్‌ తాగినట్లు ధ్రువీకరించి మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో విజయవాడ సూర్యారావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ అవయవాలపై ప్రభావం చూపింది. ప్రస్తుతం చైతన్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు" అని పోలీసులు వెల్లడించారు.

అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో లయోలా కళాశాల యాజమాన్యం చికిత్సకు అవసరమైన ఖర్చులను భరించడానికి ముందుకొచ్చింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. యాసిడ్ సీసాను ఫ్రిజ్​లో ఎందుకు పెట్టారు ? ఎవరు పెట్టారనే అనే అంశాలపై ఆరా తీస్తున్నారు . నెగ్లిజెన్స్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం!!

ABOUT THE AUTHOR

...view details