తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో మహమ్మద్ షబ్బీర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. రైల్వే పోలీసులు, మృతుని కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
షబ్బీర్ జేబులో ఉన్న పర్సులో సూసైడ్ నోట్ ఉందని కుటుంబీకులు పేర్కొన్నారు. ఆ ఉత్తరాన్ని ఇవ్వమని అడగ్గా.. రైల్వే పోలీసులు నిరాకరించారని తెలిపారు. ఈ మేరకు శవ పరీక్షల అనంతరం షబ్బీర్ మృతదేహంతో ఇల్లందకుంటలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.