ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రూ.52 లక్షల బిల్లేశారు.. మృతదేహం అప్పగించారు - జూబ్లీహిల్స్​ ప్రైవేటు ఆస్పత్రిలో యువ వైద్యురాలు మృతి

ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తన భార్య ప్రాణాలు కోల్పోయిందంటూ ఓ వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు రూ.52 లక్షలు బిల్లు చెల్లించినట్లు తెలిపారు. తాము అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

young doctor died at private hospital in Jubileehills
young doctor died at private hospital in Jubileehills

By

Published : Jun 4, 2021, 1:46 PM IST

ఓ యువ వైద్యురాలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు పోయాయని భర్త ఆరోపించారు.

హైదరాబాద్‌ శివారు కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ భావన(31)కు 15 నెలల కిందట అదే ప్రాంతంలోని డాక్టర్‌ కల్యాణ్‌తో వివాహమైంది. అప్పటికే బేగంపేట సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆమె రేడియాలజిస్టుగా పనిచేస్తున్నారు. వివాహం తరువాత వృత్తికి దూరంగా ఉన్నారు. కొవిడ్‌ బారినపడటంతో ఏప్రిల్‌ 22న భావన కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మే 6 వరకు చికిత్స పొందారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత ఏర్పడిన అనారోగ్య సమస్యల క్రమంలో.. ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు. 26 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆమెకు అమర్చిన ఎక్మో పైపు సరిగా లేక రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయిందని, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని కల్యాణ్‌ ఆరోపించారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్‌ స్థాయి 94గా ఉందని, తర్వాత పైపు సరిగా లేకపోవడంతో 64కు పడిపోయిందని తెలిపారు. అనంతరం ఫ్లూయిడ్‌ ఓవర్‌లోడ్‌ చేయడంతో గురువారం వేకువజామున 4.30 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని పేర్కొన్నారు.

ఆసుపత్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించామని, మరో రెండు వారాల్లో డిశ్ఛార్జి కావాల్సి ఉండగా ఇలా జరిగిందని వాపోయారు. ఈ ఘటనలో వైద్యులు, వైద్య సిబ్బంది వైఫల్యమేమీ లేదని, విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోయిందని ఆసుపత్రి వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

ఇవీచూడండి:

పశ్చిమగోదావరిలో 'అమూల్ పాల వెల్లువ' ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details