Selfie death: ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకునేందుకు రైల్వే హైటెన్షన్ విద్యుత్తు లైన్ పట్టుకునే యత్నంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ అనూహ్య ఘటన తెలంగాణలోని కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రామగుండం రైల్వేపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ సాయినగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ఖాన్(16) నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఒంటిపూట బడి అయిపోగానే సైకిళ్లపై స్నేహితులతో కలిసి తీగలగుట్టపల్లిలోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు.
ఆ సమయంలో కాచిగూడ-పెద్దపల్లి ప్యాసింజర్ ప్లాట్‌ఫారంపై ఆగి ఉంది. ఆ రైలు పైకెక్కిన సల్మాన్‌ఖాన్ సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుండగా హైటెన్షన్ తీగల సమీపంలో ఉండగానే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి తండ్రి సాబీర్‌ఖాన్ కరీంనగర్ బస్టాండు ఎదురుగా ఇడ్లీ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఘటన జరిగిన వెంటనే సల్మాన్‌ఖాన్ వెంట వచ్చిన స్నేహితులు సైకిళ్లను అక్కడే వదిలి పోయినట్లు సమాచారం.