YCP Leaders Hungaama: అధికార పార్టీ నేతలమనే అహంకారం.. దానికి తోడు మద్యం మైకం. ఈ రెండు జోడించి తమకెవరూ అడ్డులేరంటూ.. విశాఖ జిల్లా మాకవరపాలెంలోని ఓ దాబాలో వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పోలీసులతోనే దుర్భాషలాడారు. మద్యం సీసాలతో హంగామా చేస్తూ.. పోలీసులపై విరుచుకుపడ్డారు. అడ్డొచ్చిన వారిపై బూతుల పురాణం మొదలెట్టారు.
గొలుగొండ మండలంలోని పాకలపాడు ఎంపీటీసీ యాళ్ల లక్ష్మీ దుర్గ భర్త సన్యాసి నాయుడు.. మరికొందరు రెండు రోజుల క్రితం మాకరపాలెంలోని ఓ దాబాలో పూటుగా మద్యం తాగి అక్కడి వారితో గొడవకు దిగారు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులపై వీరంగం సృష్టించారు.
పోలీసులు వైకాపా మూకలకు బాధితులవుతున్నారు: లోకేశ్
రాష్ట్ర పోలీసులను చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. తమపై వైకాపా మూకలు దాడులు చేస్తున్నా.. పోలీసులు వారి అరాచకాలకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొత్తులుగా మారి, ప్రశ్నించే ప్రజలు ప్రతిపక్ష తెదేపాపై దాడులకీ తెగబడ్డారని ధ్వజమెత్తారు.
ఇన్ని చేసినా కొంతమంది పోలీసులు.. చివరికి వైకాపా మూకలకు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో వైకాపా కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం బరితెగింపుని వెల్లడిస్తోందని దుయ్యబట్టారు. సీఐపై మంత్రి సీదిరి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై ఎంపీ సురేష్ దాడి.. పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేదెవరని నిలదీశారు.
ఇదీ చదవండి:Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !