Cheating in the name of job : ఉద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డ మాయలేడీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగుల్ని నిండా ముంచడమే కాకుండా రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి ఉద్యోగుల నుంచి భారీగా దండుకున్నట్లు తేలింది. రూ.5 లక్షలకు తగ్గకుండా అప్పు ఇచ్చిన వారికి అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తానంటూ డబ్బున్న వారి నుంచీ భారీగానే సొమ్ము కూడబెట్టింది. ఆమె మోసాలకు బలైన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోనే కాదు హైదరాబాద్ వరకూ బాధితులున్నట్లు తెలుస్తోంది. భర్త పోలీసు ఉద్యోగన్న ధీమాతోనే మోసాల పరంపర కొనసాగించినట్లు పోలీసులు భావిస్తున్నప్పటికీ.. భర్తకు తెలిసి జరిగిందా? లేదా? అన్నది తేలలేదు. ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ కథనంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం.. నిందితురాలుతోపాటు ఆమె భర్తనూ శుక్రవారం ఠాణాకు తీసుకొచ్చి ప్రశ్నించారు.
బాధితులెందరో..ఉద్యోగాల పేరిట రూ.కోటికిపైగా దండుకున్న ఆమె రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని డబ్బున్న ఉద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు తేలింది. వైరాలోని పోలీసు శాఖలో పనిచేసే సిబ్బంది ఇద్దరు ఇలా మోసపోయారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసింది. ఇంకా ఆసక్తి ఉన్న వారి నుంచీ పెట్టుబడులు పెట్టేలా చూడాలని వారిద్దరినీ కోరగా తమ బంధువులు, స్నేహితుల నుంచి సుమారు రూ.30 లక్షల వరకు ఇప్పించారు. ఇలా ఒక్క వైరా నుంచే రైల్వే కాంట్రాక్టుల పేరిట రూ.80 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఖమ్మం, తిరుమలాయపాలెంతోపాటు హైదరాబాద్ నుంచి మహిళ ఉచ్చులో పడ్డ బాధితులున్నారు. ఆమె చేతిలో మోసపోయిన పలువురు బాధితులు శుక్రవారం ఠాణాకు వచ్చినట్లు తెలిసింది. తామే కాకుండా తమకు తెలిసిన వారు స్నేహితులు, బంధువుల కుటుంబీకులతో డబ్బులు ఇప్పించామని.. వారు తమపై ఒత్తిడి తెస్తున్నారని.. ఎలాగైనా డబ్బు ఇప్పించాలని పోలీసులను కోరినట్లు తెలిసింది.