WOMAN SUICIDE ATTEMPT : ఓ పెట్రోల్ బంక్‌లో ఓ వ్యక్తి 8 సంవత్సరాలుగా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తిన్న ఇంటికే కన్నం వేసినట్లుగా బంక్‌లో పని చేస్తూనే పెట్రోల్, డీజిల్ అమ్మగా వచ్చిన డబ్బులను చెడు వ్యసనాలకు అలవాటు పడి వాడుకున్నాడు. అలా వందలు కాదు వేలు కాదు.. సుమారు కోటి రూపాయలకు సున్నం పెట్టాడు. నగదు లావాదేవీలలో తప్పు జరుగుతున్నట్లు గుర్తించిన బంక్ ఓనర్.. కొన్ని రోజుల క్రితం సదరు మేనేజర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు అయ్యింది. అయితే బంక్ యజమాని అధిక మొత్తంలో డబ్బులు కట్టాలని వేధిస్తున్నట్లు మేనేజర్ భార్య పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. "పట్టణంలోని రామకృష్ణ ఫిల్లింగ్ సెంటర్లో జానపాటి లక్ష్మీ నరసింహులు గత 8 సంవత్సరాలుగా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి బంక్‌లోనే మోసానికి పాల్పడ్డాడు. బంక్‌లో వచ్చే నగదను తన స్వలాభాల కోసం ఖర్చు చేసుకున్నాడు. దీనిని గుర్తించిన బంక్ యజమాని గత సంవత్సరం అక్టోబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారించగా.. దాదాపు కోటి రూపాయలు వాడుకున్నట్లు తెలిసింది. అతని బ్యాంకు వివరాలను పరిశీలించగా.. అతని భార్య అకౌంట్లో కూడా లక్షలు డిపాజిట్ అయినట్లు గుర్తించాము. ఈ కేసుపై పూర్తి విచారణ చేసి నిజనిజాలు బయటపెడతాం" అని జమ్మలమడుగు సీఐ సదాశివయ్య తెలిపారు. అయితే నరసింహులు భార్య ఆత్మహత్యాయత్నం కేవలం కేసును పక్కదారి పట్టించడానికే అని పోలీసులు ఆరోపిస్తున్నారు.