ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

"దృశ్యం" సినిమా చూపించాలనుకుంది.. కానీ వారానికే నిజం కక్కేసింది! - ఎల్లారెడ్డిలో దారుణం

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేసి.. కొత్తగా కడుతున్న ఇంట్లో పూడ్చి పెట్టింది ఓ భార్య! ఈ రహస్యాన్ని దాచేందుకు చేసిన ప్రయత్నం.. సినిమాకు ఎంతమాత్రమూ తీసిపోదంటే అతిశయోక్తి కాదు. అచ్చం హీరో వెంకటేశ్​ నటించిన "దృశ్యం" సినిమాను తలపించేలా సాగిన ఈ హత్య వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఆ సినిమాలో మాదిరిగా నిజాన్ని దాచలేకపోయింది. వారం రోజులకే గుట్టు బయటపడిపోయింది. మరి, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీని మీరూ ఓ సారి చూసేయండి.

murder
murder

By

Published : Jul 7, 2022, 8:33 PM IST

హీరో వెంకటేశ్​ నటించిన "దృశ్యం" సినిమాను తలపించేలా జరిగిన.. ఓ రియల్​ క్రైం కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సినిమాలో.. అనుకోకుండా చేసిన ఓ హత్య నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ సామాన్యుడు.. నిజాన్ని నిర్మాణంలో ఉన్న పోలీస్​స్టేషన్​లో సామాధి చేస్తాడు. ఈ రియల్ స్టోరీలో మాత్రం తన వివాహేతర సంబంధం బయటపడకుండా ఉండేందుకు.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. తాను పనిచేసే ఇంట్లోనే పూడ్చింది భార్య! కానీ.. ఇది సినిమా కాదు కదా! అందుకే.. ఎక్కువ రోజులు నిజాన్ని దాచలేకపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...

కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా బొందపల్లికి చెందిన రమేశ్​(27) అతని భార్య వెన్నెల‍(25)తో కలిసి భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా.. భవన నిర్మాణ పనులకు వెళ్తున్న క్రమంలోనే రమేశ్​ భార్య వెన్నెలకు వికారాబాద్ జిల్లాకు చెందిన దస్తప్పతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేత సంబంధానికి దారి తీసింది.

జూన్​ 30న వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రమేశ్​ చూడటంతో.. చాలా కాలంగా సాగుతున్న వీళ్ల వ్యవహారం బయటపడింది. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. తన బండారం బయటపడకుండా ఉండాలంటే రమేశ్​ను అడ్డుతొలగించుకోవటమే ఏకైక మార్గమని వెన్నెల భావించింది. ఇంకేముంది.. తర్వాతి రోజే దస్తప్పతో కలిసి వెన్నెల తన భర్త రమేశ్​ను గొంతు నులిమి హతమార్చింది. మృతదేహం ఎవరికీ దొరకకుండా చేయటం కోసం.. వాళ్లు పని చేస్తున్న ఇంటినే ఎంచుకున్నారు. కొత్తగా కడుతున్న ఇల్లు కావటంతో.. ఎవరికీ అనుమానం రాదని అదే ఇంట్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు.

ఇంతా చేసి.. ఏమీ ఎరుగనట్టు తిరిగి తమ స్వస్థలానికి వెన్నెల వెళ్లింది. తన భర్త కనిపించట్లేదని.. అక్కడికి గానీ వచ్చాడా..? అంటూ బంధువులను వాకబు చేసింది. వెన్నెల మీద అనుమానం వచ్చిన బంధువులు.. గద్దించి అడగ్గా అసలు విషయం ఒప్పేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రమేశ్​ కుటుంబసభ్యులు ఎల్లారెడ్డికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని తవ్వి బయటకు తీసి అక్కడే పంచనామా పూర్తి చేశారు. నిందితులను చట్టప్రకారంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details