కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసీ కాలువలో.. కార్తిక దీపాలు వదిలేందుకు వెళ్లిన భార్యాభర్తలు గల్లంతయ్యారు. పట్టణంలోని అబ్బాస్ నగర్‌కు చెందిన రాఘవేంద్ర ప్రసాద్, ఇందిరా భార్యాభర్తలు. కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని వినాయక ఘాట్ వద్ద ఉన్న కేసీ కాలువ వద్దకు వెళ్లారు. ఇందిరా దీపాలు వెలిగించి కాలువలో వదిలేందుకు దిగగా.. ప్రమాదవశాత్తు కాలుజారి అందులోనే పడిపోయింది. విషయం గుర్తించిన భర్త ఆమెను కాపాడేందుకు కాలువలోకి దూకాడు. దురదృష్టవశాత్తు అతను కూడా గల్లంతయ్యాడు.
భార్యాభర్తల గల్లంతును గుర్తించిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భార్యాభర్తల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కనీసం గంటపాటు శ్రమించగా... పడిదంపాడు వద్ద దంపతుల మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కుమారులున్నట్లు పోలీసులు తెలిపారు.