Warangal Cricket betting gang arrest: పెరుగుతున్న పట్టణీకరణ, సాంకేతికతో మంచితో పాటు చెడూ పెరుగుతోంది. బెట్టింగ్, డ్రగ్స్ వంటి దందాలు గ్రామాలకూ పాకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో భారీ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీలు అభయ్, ప్రసాద్ అరెస్టు చేసి... నిందితుల నుంచి రూ.2 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడి కోసం ముంబైకి ప్రత్యేక బలగాలను పంపిస్తామని వరంగల్ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
పెద్దఎత్తున లావాదేవీలు
ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లో గత 3 నెలల నుంచి బెట్టింగ్ ద్వారా భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వివిధ బ్యాంకులకు చెందిన 43 పాసు పుస్తకాలు.. ఏటీఎం కార్డులు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ తరుణ్ జోషి వివరించారు.
ఇలా దొరికారు..
తొలుత కరీంనగర్... ఆ తర్వాత.. హైదరాబాద్... అక్కడినుంచి వరంగల్‌కు వచ్చి స్ధిరపడ్డ రెడీమేడ్ బట్టల వ్యాపారి ప్రసాద్ ఈ బెట్టింగ్‌కు తెరలేపాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో రెండేళ్ల క్రితమే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రసాద్‌కు ముంబయి కేంద్రంగా... ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అభయ్ విలాస్ రావుతో పరిచయం ఏర్పడింది. వీరు ప్రత్యేకంగా వెబ్ సైట్ క్రియేట్ చేసి... గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, పేకాటల ద్వారా భారీగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. అభయ్ నిర్వహించే ఆన్లైన్ గేమింగ్‌లో ప్రసాద్... రెండు తెలుగు రాష్ట్రాలకూ బుకీగా మారాడు. లింక్ క్రియేట్ చేసి.. దానిని ఖాతాదారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అభయ్ ఆన్‌లైన్‌లో వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు... హనుమకొండ గోపాల్ పూర్లోని ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా సమాచారం అందుకున్న కేయూ పోలీసులు... నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రధాన నిర్వాహకులు ముంబయిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు కొందరు ఈ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నారు. వారికి పాస్వర్డ్స్ ఇచ్చారు. ఇలా ఒక లింక్ క్రియేట్ చేసి కస్టమర్లకు పంపిస్తున్నారు. మాకు 7 ఫోన్లు దొరికాయి. అన్ని ఫోన్లలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. లింక్స్ ద్వారా కస్టమర్లు బెట్టింగ్ చేస్తున్నారు.
-తరుణ్ జోషి, వరంగల్ సీపీ
బెట్టింగ్ ప్రాసెస్