MURDER: ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. అనుకున్నట్లు గానే ప్రేమికుడితో కలిసి భర్తను చంపడానికి పథకం రచించింది. అర్ధరాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అతడిని చంపి.. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి జనసంచారం లేని ప్రదేశంలో పడేసింది. అ తర్వాత తన భర్త అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దాంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మాత్రం విస్తుపోయే అంశాలు బయటికి వచ్చాయి.
ప్రియుడి కోసం.. భర్తను హతమార్చిన భార్య.. కానీ చివరికి - విశాఖ జిల్లా తాజా వార్తలు
13:31 July 21
వచ్చిన మర్నాడే చంపేసి...
నార్త్ జోన్ ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస గ్రామానికి చెందిన బుడుమూరి మురళి (43) ఆఫ్రికా దేశంలో ఆచార్యునిగా పని చేస్తున్నారు. 2014లో ఆయనకు విశాఖలోని మధురవాడకు చెందిన మృదులతో పెళ్లయింది. వివాహం అనంతరం భార్యను తీసుకుని ఆఫ్రికాకు వెళ్లిపోయారు. వీరిద్దరికి అక్కడే 2015లో కొడుకు పుట్టాడు. కొన్నాళ్లకు కుమారుడికి అనారోగ్యం కారణంగా భార్యను, కొడుకును స్వదేశానికి పంపించారు. ఆమె కొన్నాళ్లపాటు మధురవాడలోని పుట్టింట్లోనే ఉంది. ఏడాది క్రితం మధురవాడ రిక్షా కాలనీలో మురళి సొంతిల్లు నిర్మించడంతో భార్య, కుమారుడు ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అతను ఏడాదికోసారి స్వదేశానికి వచ్చి నెలరోజులు ఉండి వెళ్తుండేవారు.
వచ్చిన మర్నాడే చంపేసి...:ఈనెల 9న మురళీ సెలవుపై ఇంటికొచ్చారు. తర్వాత.. 17వ తేదీన తన భర్త కనబడటం లేదంటూ మృదుల పీఎంపాలెం స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేయగా సాయిరాం కాలనీకి చెందిన హరిశంకర్‌వర్మ (18) అనే యువకుడు వీరి ఇంటికి తరచూ వస్తుంటాడని వెల్లడైంది. అనుమానం వచ్చి ఆమె కాల్ డేటా పరిశీలించగా మృదుల ఎక్కువసార్లు అతడితో మాట్లాడినట్లు గుర్తించారు. అతడ్ని విచారించగా.. ‘ఎనిమిది నెలల క్రితం ఆమెతో పరిచయం ఏర్పడింది. ఇద్దరం కలిసి ఆమె ఇంట్లోనే ఉంటున్నాం. మురళీని ఎలాగైనా వదిలించుకోవాలని పథకం వేశాం. ఆయన ఆఫ్రికా నుంచి వచ్చిన మర్నాడే అంటే ఈ నెల 10న అర్ధరాత్రి నేను రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుంటే ఆమె పెనంతో, తర్వాత కుక్కర్ మూతతో బలంగా తలపై మోదడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి ద్విచక్ర వాహనంపై మారికవలస బ్రిడ్డి వద్ద తుప్పల్లో విసిరి వచ్చేశాం. రెండు రోజుల తర్వాత వెళ్లి చూస్తే దుర్వాసన వస్తోంది. దీంతో పెట్రోల్ తీసుకువెళ్లి మృతదేహాన్ని కాల్చివేశాం’ అని విచారణలో పేర్కొన్నాడని ఏసీపీ వెల్లడించారు. నిందితురాలు మృదులను విచారించగా భర్తతో కాపురం ఇష్టం లేక ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు అంగీకరించింది.
ఇవీ చదవండి: