తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో వరద ఉద్ధృతికి పెళ్లి కారు నీటిలో కొట్టుకు పోయిన ఘటన జిల్లా వాసులను ఆవేదనకు గురిచేసింది. కారులో ఆరుగురు ఉండగా.. వరద ఉధృతికి నలుగురు నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో డ్రైవర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. నవ వధువు, పెళ్లి కుమారుడి సోదరి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి. మరో బాలుడి జాడ మాత్రం కానరాలేదు.
ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ నారాయణతో కలిసి ఆ వాగులోనే సుమారు 4 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఘటన స్థలిని పరిశీలించి.. గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అక్కడ గుర్తించిన నవ వధువు మృతదేహాన్ని స్థానికులు, గ్రామస్థులతో కలిసి రెండు కిలోమీటర్ల మేర స్వయంగా మోసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. వాగులో నవ వధువు మృతదేహాన్ని చూసిన ఎమ్మెల్యే ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కాళ్లకు పెట్టిన పారాణీ సైతం ఇంకా ఆరనే లేదంటూ వాపోయారు. వాగు ఉద్ధృతిని డ్రైవర్ అంచనా వేయలేకపోవడమే ప్రమాదానికి కారణమని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
గల్లంతైన బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు. మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని.. మృతదేహాలకు పోస్టుమార్టం త్వరగా నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు.
'వాగు ఉద్ధృతిని డ్రైవర్ అంచనా వేయలేకపోయారు. అందువల్లనే కారు కొట్టుకుపోయింది. డ్రైవర్ స్థానికుడు కాకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. అతను పెళ్లి కొడుకు చుట్టమని తెలిసింది. పెళ్లి కొడుకు, వాళ్ల అక్కా సురక్షితంగా బయటపడ్డారు. రాత్రంతా గాలింపు చర్యలు జరిగాయి. పెళ్లి కుమార్తె మృతదేహం దొరికింది. ఆమె కాళ్లకు పారాణి ఇంకా ఆరనే లేదు. ఇంకొకరి మృతదేహం సైతం లభ్యమైంది. చెట్ల పొదల్లో ఆ రెండు మృతదేహాలు దొరికాయి. ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకొనే ప్రయత్నం చేస్తాం. ఈ వాగు వద్ద ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం.. ఇక్కడ ఇంకా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవచ్చో ఇంజినీర్లతో సమీక్ష నిర్వహిస్తాం.'