హత్య ఎవరు చేయొచ్చు..?
ప్రత్యర్థులు చేయొచ్చు..
ఇంకా..?
దోపిడీ దొంగలు చేయొచ్చు..
ఇంకా..
ఇంకా.. సంఘవిద్రోహులంతా చేయొచ్చు..
ఇంకా..?
ఇంకా.. ఇంకెవరుంటారు??
మనవాడే చేయొచ్చు.. బంధువే రాబంధువూ కావొచ్చు..
లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా??
ఉంది.. విజయవాడ నగరంలో జరిగింది..
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతం అది.. ఈనెల 5వ తేదీ.. గడియారం ఉదయపు 7 గంటలు కొట్టి చాలా సేపవుతోంది.. 8 కూడా దాటింది..! కానీ.. రోజూ 6 గంటలకన్నా ముందే నిద్రలేచే కొండయ్య, పైడమ్మ దంపతులు ఇంకా లేవలేదు. తలుపు కూడా తెరవలేదు. ఊరుకేమైనా వెళ్లారా.. అంటే లేదు. నిన్న రాత్రి మనకు కనిపించారుగా?! ఏమైంది.. అనుకుంటూ వెళ్లి తలుపు కొట్టారు చుట్టు పక్కలవాళ్లు. చప్పుడు లేదు. కిటికీలోంచి తొంగి చూశారు. 65 ఏళ్ల కొండయ్య.. 60 ఏళ్ల పైడమ్మ ఇంట్లోనే ఉన్నారు.. కానీ.. ఎంత పిలిచినా ఇద్దరిలో కదలిక లేదు. మనసు కీడు శంకించింది.
ఇదేదో తేడా వ్యవహారంలా అనిపించి, వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల్లో వాలిపోయారు. లోనికి వెళ్లి చూస్తే.. ఇద్దరి ప్రాణం పోయి చాలా సమయమే అవుతోందని అర్థమవుతోంది. ఎవరైనా కొట్టి చంపారా?.. లేదా మరో విధంగా ప్రాణాలు తీశారా? తెలియట్లేదు. ఆనవాళ్లేవీ కనిపించట్లేదు. అయితే.. వృద్ధులకు రోజు మద్యం తాగే అలవాటు ఉందని.. అది కూడా నాణ్యతలేని తక్కువ ధర మందు తాగుతారని.. ఒక్కోసారి సర్జికల్ స్పిరిట్ కూడా తీసుకుంటారని స్థానికులు ఎవరో చెప్పారు. ఇలాంటి.. వివరాలన్నీ సేకరించిన పోలీసులు.. కేసు రిజిస్టర్ చేశారు.
కేసు నమోదైంది గానీ.. ఏం జరిగి ఉంటుంది? పోలీసుల దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఇక్కడే పోలీసు బుర్రకు పదును పెట్టారు. ఎలాంటి క్రైమ్ లో అయినా సరే.. ఫస్ట్ లాజికల్ పాయింట్ ఒకటి ఉంటుంది. మొదటి సాక్షిగా ఉన్న వ్యక్తే.. మొదటి నిందితుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే పద్ధతిలో.. హంతకుడు బయటివాడు అని తేలకపోతే.. నిందితుడు ఇంట్లోనే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ వృద్ధ దంపతుల విషయంలోనూ పోలీసులు ఇదే విధంగా ఆలోచించారు. ఇంట్లో దొంగతనం ఏమీ జరగలేదు.. కాబట్టి ఈ హత్య దొంగల పని కాదు. ప్రత్యర్థులు వచ్చి దాడిసినట్టుగా ఆధారాలేమీ కనిపించట్లేదు. అనారోగ్యంతో చనిపోయారని అనుకోవడానికి.. ఇద్దరూ ఒకే రోజు కాలం చేస్తారా? సమ్ థింగ్ ఈజ్ రాంగ్.. పోలీసు ఆలోచనలో వేగం పెరిగింది.