విశాఖలో ఓ వరలక్ష్మి, ఓ ప్రియాంక, బద్వేలులో శిరీష, ధర్మవరంలో స్నేహలత, ప్రొద్దుటూరులో లావణ్య.. వీరంతా ప్రేమోన్మాదుల చేతిలో దాడికి గురైన బాధితులే. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు కష్టమ్మీద బతికారు. ఆ కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆచరణకు నోచుకోలేదు. దీంతో బాధిత కుటుంబాలకు అంతులేని క్షోభ మిగులుతోంది. ఇందులో కొందరు బిడ్డలను బతికించుకోవడానికి ఉన్నవన్నీ అమ్ముకున్నారు. అదీ చాలక అందినకాడికి అప్పులు చేశారు. అప్పటికే ఇంట్లో జరిగిన విషాద ఘటన నుంచి కోలుకోలేక అంతులేని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మరోవైపు జైలు నుంచి బయటకొచ్చిన నిందితులు తమను బెదిరిస్తుండటంతో బాధిత కుటుంబాల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. దోషులకు శిక్ష పడకపోవడం, కళ్ల ముందే నిందితులు దర్జాగా తిరగడం చూసి వారిలో ఆక్రోశం పెల్లుబుకుతోంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే పదే పదే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వారంతా వాపోతున్నారు. గత ఏడాది కాలవ్యవధిలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాద దాడుల ఘటనల్లో బాధితుల తల్లిదండ్రులతో ‘ఈనాడు- ఈటీవీ-ఈటీవీ భారత్ ఆంధ్రప్రదేశ్’ మాట్లాడింది. వారి ఆవేదనపై ప్రత్యేక కథనం.
గొంతుకోసి చంపి.. బెయిలుపై బయటకు..
2020 అక్టోబరు 31 విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మిని గొంతు కోసి చంపేశారు. పోలీసులు అభియోగపత్రం దాఖలుచేశారు.కేసు విచారణలో ఉంది. నిందితుడు అఖిల్ బెయిలుపై బయటకొచ్చాడు.
ఇలాగైతే ఆడపిల్లలకు రక్షణ ఎలా?
మా అమ్మాయిని చంపిన వ్యక్తి మా కళ్లముందే కాలర్ ఎగరేసుకుని తిరుగుతుంటే నిస్సహాయంగా చూస్తున్నాం. దిశ చట్టం ప్రకారం వెంటనే శిక్ష పడుతుందన్నారు. ఇప్పటివరకూ పడలేదు. మా అమ్మాయి చనిపోయినప్పటి నుంచి నా భార్య తరచూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతోంది. ఆమెకు ఏమవుతుందోనని భయమేస్తోంది. నేరాలకు పాల్పడినవారు స్వేచ్ఛగా తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఏం ఉంటుంది? ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. వ్యవస్థపైనే విరక్తి కలుగుతోంది. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం మీకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చింది కదా అంటున్నారు. మేం డబ్బులు అడగలేదు.. మాకు న్యాయం చేయాలని, మరో అమ్మాయికి ఇలా జరగకూడదని మాత్రమే కోరాం. - సత్య గురునాథ్ (హరి), వరలక్ష్మి తండ్రి
2021 జూన్ 18: కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువుకు చెందిన శిరీషను కత్తితో పొడిచి చంపిన కేసులో చరణ్‌రాజ్, నాయబ్ రసూల్, నరసింహం నిందితులు. రసూల్, నరసింహం బెయిల్‌పై బయటకొచ్చారు. చరణ్‌రాజ్‌పై పోలీసులు రౌడీషీట్ తెరిచి, రిమాండ్‌లో ఉంచారు. అభియోగపత్రం దాఖలైంది. కేసు విచారణలో ఉంది.
నిందితులు బయటికొచ్చి బెదిరిస్తున్నారు...
నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే బయటకొచ్చి, మమ్మల్ని బెదిరిస్తున్నారు. బెయిల్ కోసం రూ.1.30 లక్షలు ఖర్చుచేశామని, తమకేం కాదని, మేం వాళ్లనేమీ చేయలేమని సవాల్ చేస్తున్నారు. మా అమ్మాయిని చంపిన ప్రధాన నిందితుడు జైలు నుంచి బయటకు వస్తే ఇంటిల్లిపాదీ విషం తీసుకుని చావడం తప్ప.. మరో మార్గం లేదు. అతనివల్ల మా ప్రాణాలకు ముప్పు ఉంది. మా అమ్మాయిని ఎంత ఘోరంగా చంపారో.. అంతే నరకం చూపించి వారికి మరణశిక్ష వేయాలి. ఏ అమ్మాయి జోలికైనా వెళ్లాలంటే భయపడేలా శిక్ష వేయాలి. మా అమ్మాయికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకేమో వారిపై పోరాడేంత ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించింది. నా కుమారుడికి పొరుగుసేవల ఉద్యోగం ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మా అమ్మాయిని హతమార్చిన నిందితులు ముగ్గురికీ ఉరిశిక్ష పడితేనే మాకు న్యాయం జరుగుతుంది. -జి.సుబ్బయ్య, శిరీష తండ్రి, చింతలచెరువు గ్రామం, కడప జిల్లా
ఏడాది వ్యవధిలో జరిగిన దాడులు
2020 అక్టోబరు 15: విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని (20)ని ఆమె ఇంట్లోనే కత్తితో పొడిచి హతమార్చిన ఘటనలో నాగేంద్రబాబు నిందితుడు. ఈ కేసులో అభియోగపత్రం దాఖలైంది. నిందితుడు బెయిల్‌పై ఉన్నారు. అతనిపై రౌడీషీట్ తెరిచారు.
2021 ఆగస్టు 15: గుంటూరులో నడిరోడ్డుపై రమ్య అనే యువతిని కత్తితో పొడిచిన ఘటనలో శశికృష్ణ నిందితుడు. ఈ కేసులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడు రిమాండులో ఉన్నాడు.
2020 డిసెంబరు 23: అనంతపురం జిల్లా ధర్మవరం స్టేట్‌బ్యాంకులో పొరుగుసేవల ఉద్యోగిని కె.స్నేహలతను హతమార్చిన కేసులో రాజేష్, కార్తీక్ నిందితులు. కేసులో అభియోగపత్రం దాఖలైంది. విచారణ నడుస్తోంది. ప్రధాన నిందితుడు రాజేష్ జైల్లో ఉండగా కార్తీక్ బెయిల్‌పై బయటకొచ్చాడు.
అన్యాయం జరిగినప్పుడే స్పందించి ఉంటే..