గుంటూరు బ్రాడీపేటకు చెందిన కిరణ్ కుమార్ సున్నం వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవలే అతనికి గ్రంధి హరిబాబు, కొల్లి లక్ష్మణరావు పరిచయం అయ్యారు. నమ్మకంగా ఉంటూ స్నేహంగా మెలిగారు. కిరణ్ కుమార్ గత ఏడాది జులైలో పిడుగురాళ్లకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఫోర్డ్ ఫిగో యాస్పైర్ సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. కారును తన కుటుంబ అవసరాల నిమిత్తం వాడుకుంటున్నాడు. ఈ ఏడాది జనవరిలో తన ఇంటి ఎదురుగా కారు పార్కు చేసి వెళ్ళాడు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఇంటి ముందు పెట్టిన కారు కనిపించలేదు. వెంటనే స్థానిక అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా అతని స్నేహితుల గ్రంధి హరిబాబు, కోలి లక్ష్మణరావుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బులు అవసరమైనందున తామే కారు దొంగలించినట్లు హరిబాబు, లక్ష్మణరావులు(two friends thefted car) ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి కారు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ నరేష్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినందునే.. కారు దొంగతనానికి పాల్పడ్డామని నిందితులు వెల్లడించారు. పథకం ప్రకారం కిరణ్ వద్ద ఉన్న కారును దొంగిలించి కొంతకాలం బాడుగకు తిప్పుకొని, ఆ తరువాత అమ్ముకొనే ఆలోచన చేశారు. ఈలోపే కిరణ్ కారు పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భయపడిన నిందితులు.. లాయర్ని కలిసేందుకు యత్నించారు. కానీ ఆలోపే పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు.