DOCTOR KIDNAP : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లికి చెందిన మోహనకృష్ణ, గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ సుష్మ రెండు వారాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సుష్మా తల్లి గుంటూరు జిల్లాలో మాజీ సర్పంచ్ కాగా...తండ్రి వైకాపా నాయకుడు. ఈ వివాహం ఇష్టం లేని సుష్మ తల్లిదండ్రులు ప్రేమ జంట నివాసం ఉంటున్న మోహన్‌కృష్ణ ఇంటికి వచ్చి తిరిగి వచ్చేయాలని సంప్రదింపులు జరిపారు. సుష్మ అంగీకరించకపోవడంతో వెళ్లిపోయి....తిరిగి వచ్చి ఉదయం మోహన్‌కృష్ణ ఇంటిపైకి దాడికి దిగారు. ఇంటి తలుపులు పగులగొట్టి విధ్వంసం సృష్టించి...కూతురు సుష్మను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
గుంటూరు నుంచి వచ్చి ఇంటిపై దాడి చేయడంతో పాటు యువతిని తీసుకెళ్లడాన్ని మోహనకృష్ణ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు వివరాలు సేకరించారు. ప్రేమ వివాహం నచ్చని సుష్మ తల్లిదండ్రులు... ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోపే తల్లిదండ్రుల నుంచి తప్పించుకొన్న సుష్మ...గుంటూరు నుంచి ప్రైవేటు వాహనంలో తిరుపతికి వచ్చారు. రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట తిరుపతి ఎస్పీని ఆశ్రయించారు.