బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు, డ్వాక్రా సంఘాల ఖాతాల నుంచి నగదు స్వాహాకు పాల్పడిన 16 మంది బ్యాంకు సిబ్బందిని జిల్లా అడిషనల్ ఎస్పీ మహేష్ కలికిరిలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు స్వాహా కేసులో 16 మంది అరెస్టు - kalikiri bob scam latest news
16:54 September 16
బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు స్వాహా కేసులో 16 మంది అరెస్టు
చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ల సొమ్ము మాయమయ్యాయి. రూ.2.38 కోట్లు స్వాహా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. పొదుపు సంఘాలు, వ్యక్తిగత ఖాతాల సొమ్మును సిబ్బంది కాజేసినట్లుగా తెలుస్తోంది. 15 ఏళ్లుగా తాత్కాలిక మెసెంజర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కొందరు బ్యాంక్ ఉద్యోగుల సహకారంతో భార్య ఖాతాలోకి నగదు మళ్లించిన వైనం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కలికిరి మండలంలోని కూకట్ గొల్లపల్లికి చెందిన గణపతి ఎస్‌హెచ్‌జి గ్రూప్ సభ్యులు తమకు రుణం కావాలని కోరారు. అయితే అప్పటికే వారి పేరిట రూ.10 లక్షలు రుణం మంజూరై తీసుకున్నట్లు ఉండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు రుణాన్ని తీసుకోలేదంటూ సంఘ మిత్రులతో కలిసి సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకులో స్వాహా విషయం బయటకు రావడంతో జిల్లా డీఆర్డీఏ ఆధ్వర్యంలో 15 మందితో కూడిన పరిశీలన కమిటీ బృందం.. రంగంలోకి దిగి బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా 235 గ్రూపులకు సంబంధించిన నగదు లావాదేవీలు పరిశీలించింది. మొత్తం రూ.2.38 కోట్లు నగదు స్వాహా అయినట్లు గుర్తించి అధికారులకు నివేదించింది. దీనిపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాల్మీకిపురం సిఐ నాగార్జునరెడ్డి, కలికిరి ఎస్సై లోకేశ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందుకు బాధ్యులైన బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్లతోపాటు మెసెంజర్, మెసెంజర్ బంధువులు కలిపి మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు.
బ్యాంకు సిబ్బంది ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో సృష్టించి మెసెంజర్ అలీఖాన్ డబ్బులు కాజేసి పంచుకోవడం జరిగిందని ఏఎస్పీ మహేశ్ అన్నారు. ఆ విధంగా మెసెంజర్ సంపాదించిన డబ్బులతో.. 1,120 గ్రాముల బంగారు నగలను కొని.. అవి బ్యాంకులో పెట్టి తిరిగి లోను తీసుకున్నట్లు తెలిపారు. ఆ నగలను కూడా సీజ్ చేసినట్లు ఏఎస్పీ వివరించారు. మొత్తం మూడు ద్విచక్ర వాహనాలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు రూ.20 లక్షల నగదు, మెసెంజర్ బంధువుల ద్వారా బ్యాంకులో దాచిన బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం రూ.70 లక్షలు విలువగల నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వివరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలో చాకచక్యంగా కేసు ఛేదించిన వాల్మీకిపురం సీఐ నాగార్జున రెడ్డి, కలికిరి ఎస్సై లోకేశ్ రెడ్డి, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి:
- DWAKRA WOMEN MONEY SCAM: డబ్బులు కొట్టేశాం.. వాటాలు పంచుకున్నాం..
- BANK SCAM: కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆ రెండు కోట్లు ఏమయ్యాయి..?