ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 15, 2022, 8:56 PM IST

Updated : Mar 16, 2022, 2:07 AM IST

ETV Bharat / crime

Today Crime News: కర్నూలు జిల్లా డోన్​లో యువకుడిపై వేట కొడవలితో దాడి...

Today Crime News: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా కల్లిపూడి సమీపంలో తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యమైంది. అనంతపురం జిల్లా పెనుకొండలోని అటవీశాఖ కార్యాలయంలో గంధం చెక్కలు దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసినట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. అనంతపురం జిల్లా 44వ జాతీయ రహదారిపై ఓ సైకో హల్​చల్ చేయగా, కర్నూలు జిల్లాలో రెండేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బావిలో తోశారు.

today  overall crime in andhra pradesh
కర్నూలు జిల్లా డోన్​లో యువకుడిపై వేట కొడవలితో దాడి... పరిస్థితి విషమం

డోన్​లో యువకుడిపై వేట కొడవలితో దాడి...

కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలోని రైల్వే గేటు వద్ద ఓ యువకుడిపై మరో యువకుడు వేటకొడవలితో దాడి చేశాడు. చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన బోయ శేఖర్, రవిలు కలిసి ద్విచక్రవాహనంపై డోన్​కు వచ్చారు. పట్టణంలో రైల్వే గేటు పడడంతో అక్కడ ఆగారు. రవి బండి దిగి గేటు దాటి ముందుకు వెళ్లాడు. గేటు తెరిచేలోపు బండి పైన ఉన్న శేఖర్​పై తారక రామనగర్​కు చెందిన రాజు వేటకొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్​ను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కర్నూల్​కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడి జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యం..

చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కల్లిపూడి సమీపంలో తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. మృతుని వద్ద లభించిన ఆధారాలు ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన బాలాజీ(38)గా గుర్తించారు. అతనిది పుల్లూరు కాగా కొన్నేళ్లుగా వనపర్తిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడినట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఇంటికి వచ్చిన అతను తెలుగు గంగ కాలువలో శవమై తేలడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

గంధం చెక్కల చోరీ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు..

అనంతపురం జిల్లా పెనుకొండలోని అటవీశాఖ కార్యాలయంలో జనవరి 17న 92 సంచుల శ్రీగంధపు చెక్కలు, 16లీటర్ల శ్రీ గంధం ఆయిల్​ను చోరీ చేసిన దుండగుల్లో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. ఈ కేసులో పోలీసులు బృందాలుగా ఏర్పడి కర్ణాటక, తమిళనాడులో గాలింపు చేపట్టారని తెలిపారు. మొత్తం 13 మంది ముద్దాయిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 24న ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 68 సంచుల శ్రీగంధం చెక్కలు , రెండు లారీలు, ఒక కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోమవారం ప్రధాన ముద్దాయిలు బాబాజాన్ అలియాస్​ బాబ్జాన్, జయకుమార్ అలియాస్​ సెల్వంలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.16 లక్షల విలువచేసే శ్రీగంధం ఆయిల్, రూ.11 లక్షల విలువచేసే 14 సంచుల శ్రీ గంధం చెక్కలు, 4 సెల్ ఫోన్లు, రూ.2500 స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 13 మంది ఉండగా ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో సైకో హల్​చల్..

అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఓ సైకో హల్​చల్ చేశాడు. హర్యానాకు చెందిన అగంతకుడు చేతిలో కత్తి పట్టుకుని హైవేపై వీరంగం సృష్టించాడు. అతని చర్యల వల్ల రహదారిపై వెళ్లే వాహనదారులు, గోనిపేట రోడ్డు పక్కన ఉన్న మహిళలు ఇబ్బందులు పడ్డారు. కత్తి లాక్కోవడానికి ప్రయత్నం చేసిన స్థానికులపై ఆ సైకో రాళ్లతో దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ లక్ష్మి నారాయణరెడ్డి, హోంగార్డు విశ్వతో హైవేపై గాలించారు. రాత్రి 11 గంటల సమయంలో అతను జాతీయ రహదారి ప్రక్కన గోనిపేట రోడ్డు సమీపంలో కత్తి పట్టుకొని నడుచుకొని వెళుతుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కత్తి లాక్కుని కౌన్సిలింగ్ ఇచ్చారు.

రెండేళ్ల బాలుడిని బావిలో తోసి..

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో రెండేళ్ల బాలుడు నరసింహను గుర్తుతెలియని వ్యక్తులు బావిలో తోశారు. విషయం తెలియని తల్లితండ్రులు బాలుడు తప్పిపోయాడని ఇస్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఇంటి సమీపంలోని ఓ బావిలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు సుంకులమ్మ, కేశవ కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకును కావాలనే ఎవరో బావిలో తోశారని తల్లితండ్రులు ఆరోపించారు. ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రేషన్​ బియ్యం పట్టివేత...

లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మైలవరం ఎస్సై రాంబాబు పట్టుకున్నారు. చిన్న నందిగామ రోడ్డు వద్ద నిలిపి ఉంచిన జగ్గయ్యపేటకి చెందిన లారీలో 20 వేల రూపాయల విలువైన 3.25 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉందన్న విశ్వసనీయ సమాచారం అందుకుని, లారీ డ్రైవర్​ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ రాంబాబు తెలిపారు.

దంపతులపై దాడి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులపై గుర్తుతెలియని ఏడుగురు దండుగులు దాడి చేశారు. ఈ ఘటనలో మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పేరం నాగరాజు, అతని భార్య జ్యోతికి గాయాలయ్యాయి. జ్యోతి కేకలు విని .. స్థానికులు రావటంలో దుండగులు పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బాలకృష్ణ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ బావికి వచ్చే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో.. తానే స్వయంగా కరెంటు స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వేడంగి కెనాల్ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పాలుకొల్లు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం.. లారీని ఢీ కొట్టిన ఘటనలో ఉదయ్ సాయి అనే వ్యక్తి ఘటన స్థలంలో మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని భీమవరం ఆస్పత్రికి తరలించగా.. రవికుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడోవ్యకిని మెరుగైన వైద్యం కోసం ఏలూరుకి తరలించారు.

ఇదీ చదవండి: 'పోలీసులు కొట్టడం వల్లే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు'

Last Updated : Mar 16, 2022, 2:07 AM IST

ABOUT THE AUTHOR

...view details