ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CRIME NEWS: రాష్ట్రంవ్యాప్తంగా వేర్వేరు ప్రమాదాలు.. 14 మంది మృతి - బేతంచర్ల వద్ద రోడ్డు ప్రమాదం

CRIME NEWS: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలో చిరుత సంచారం.. స్థానికంగా కలకలం రేపింది.

CRIME NEWS
రాష్ట్రంలో పలు ప్రమాదాలు

By

Published : May 4, 2022, 2:58 PM IST

Updated : May 4, 2022, 11:51 PM IST

బేతంచర్ల వద్ద రోడ్డు ప్రమాదం:నంద్యాల జిల్లా బేతంచర్ల వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు యువకులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బేతంచర్ల నుంచి డోన్‌కు వెళ్లే దారిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులు మనోహర్‌, మధుకృష్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

నెల్లూరు జిల్లా: సంగంలో విషాదం చోటుచేసుకుంది. హరిజనవాడ సమీపంలోని కలిగిరి రిజర్వాయర్ ప్రధాన కాల్వలో గల్లంతైన ఈశ్వర్(10), శ్రీరామ్(8) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

కృష్ణాజిల్లా: గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో షార్ట్ సర్క్యూట్​తో పూరిల్లు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

*విస్సన్నపేట, రెడ్డిగూడెం మండలంలోని ఇద్దరు నాటుసారా తయారీదారులపై సీపీ కాంతిరాణా టాటా పీడీ యాక్టు నమోదు చేశారు. ఇద్దరిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

పార్వతీపురం మన్యం జిల్లా: కృష్ణపల్లిలో ఓ దుండగుడు వైఎస్​ఆర్​ విగ్రహాన్ని నేల పడవేసి కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన చోటు చేసుకోంది. స్థానికులు దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సీఐ విజయానంద్, ఎస్సై కళాధర్​ నిందితునిపై కేసు నమోదు చేసి, ఇందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కర్నూలు జిల్లా: ఆదోనిలో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని వెంకటరమణ శెట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు దాదాపు 82 తులాల బంగారు, 15 తులాల వెండి , 30 వేలు నగదును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై ఆదోని టూ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

*మంత్రాలయం మండలం చెట్నహల్లి పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకోంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నలుగురు బాలికలు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురిని స్థానికులు కాపాడారు. బాలికలను తెలంగాణలోని జోగులాంబ జిల్లా రాజపురం వాసులుగా గుర్తించారు.

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండలం ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వందమంది పోలీసులతో వాంబే కాలనీ, టిడ్కో ఇళ్లలో తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు.

బాపట్ల జిల్లా: కారంచేడు మండలం స్వర్ణలోని ఒక మిల్లులో అక్రమంగా నిలువ ఉంచిన 100 బస్తాల రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.

*బాపట్ల మండలం తూర్పుపిన్నిబోయినవారిపాలెంలో పిడుగుపడి సుబ్రమణ్యం అనే కూలీ మృతి చెందాడు

అన్నమయ్య జిల్లా: పీలేరు మండలం తలుపుల కొత్తచెరువులో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు.

*నిమ్మనపల్లె మండలం వెంకోజీగారిపల్లెలో ఇంటిస్థలం విషయమై ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా: కనేకల్‌ మండలం కలేకుర్తిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న మారెప్ప అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.

గుంటూరు జిల్లా: చుట్టుగుంట వద్ద రోడ్డు దాటుతున్న ఓ యువతిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మృతి చెందింది.

  • గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

వైఎస్సార్ జిల్లా: శివారులోని జేఎంజే వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బేతంచర్లకు చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు.

పల్నాడు జిల్లా: మాచర్ల మండలం కంభంపాడులో పిడుగుపడి ఓ బాలుడు మృతి చెందాడు.

  • అకాల వర్షం కారణంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని 19వ వార్డు పాత పెంకుటిల్లు పైకప్పు కూలి.. పంచుమర్తి లక్ష్మీ కుమారి (60) మృతి చెందగా, ఆమె కుమార్తె తుమ్మ సభాపతికి గాయాలైయ్యాయి. పెంకుటిల్లు కూలిన సమయంలో మృతురాలు లక్ష్మీ కుమారి మనవరాలు లోపల గదిలో ఉండటంవల్ల.. ఆమెకు ఎటువంటి అపాయము జరుగలేదు.

విశాఖ జిల్లా: మహిళను మానవ అక్రమ రవాణా నుంచి పోలీసులు రక్షించారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. వాట్సాప్ ద్వారా వచ్చి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. బంగ్లాదేశ్ మహిళను రక్షించారు. మహిళ అపహరణ ఘటనలో పెందుర్తి పీఎస్‌లో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలుపుతామన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తిరుపతి జిల్లా:చంద్రగిరి బీడీ కాలనీలో యువకుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఒకరిపై మరోకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో బీరు సీసాతో ఇద్దరిపై ఓ యువకుడు దాడి చేశాడు. వారిని సమీప ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకులపై దాడి చేసిన సల్మాన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా :గుడిబండ మండలం ముత్తుకూరు గ్రామంలో దారుణం జరిగింది. హనుమంతప్ప తలపై అతని తమ్ముడు నరసింహప్ప బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారైయ్యాడు. హనుమంతప్ప మద్యానికి బానిసై తరుచూగా గొడవలు పడేవాడని... విసుగు చెందిన తమ్ముడు అన్నను హతమార్చాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు చేశారు.

అన్నమయ్య జిల్లాలో చిరుత సంచారం:అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తలముడిపి గ్రామ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. పాపాగ్ని నదీపరివాహక ప్రాంతంలో చిరుత సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు.. అధికారులకు సమాచారమిచ్చారు. సమీపంలో చిరుత కదలికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న గ్రామస్థులు.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: Rape in mamidikuduru: వైద్యం చేసేందుకు వచ్చి.. బాలికపై కన్నేసి..

Last Updated : May 4, 2022, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details