ap crime news :రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. మరికొన్ని ఘటనల్లో పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
దారి ఇవ్వలేదని దారుణం
దారి ఇవ్వలేదని ముందు వెళ్తున్న ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తిపై మరో ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి దాడి చేశాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించేలోపే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. మృతుడు గుర్రాల చావడి ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ ఖాన్(36)గా గుర్తించారు. ఘటనకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు.
కారు కాలువలోకి దూసుకెళ్లి..
కారు కాలువలోకి దూసుకెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రేపల్లె మండలంలో జరిగింది.మృతుడు రేపల్లె పట్టణం 2వ వార్డుకు చెందిన నసీం బాషా (23)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరితనాన్ని భరించలేక మహిళ ఆత్మహత్య ..
ఒంటరితనాన్ని భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెనాలి పట్టణంలో జరిగింది. మృతురాలు భాగ్యలక్ష్మి (43)గా గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఒక సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు పాల్పడింది.
ఉద్యోగాలు ఇప్పిస్తానని ...
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని విశాఖ రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కంచరపాలెం ప్రాంతం సంతోష్ నగర్‌కు చెందిన పిల్లి నాగరాజు(33) పెందుర్తి, ఎస్. కోట ప్రాంతాలకు చెందిన కొంత మంది యువతను నమ్మించి.. రూ.40 లక్షలు వసూలు చేశాడు. అనంతరం నకిలీ ఉద్యోగ గుర్తింపు కార్డులు అందజేసి.. పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని నాగరాజును మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.