తిరుపతి జిల్లా : తిరుమల నుంచి తిరుపతికి వచ్చే రహదారిలో ప్రమాదం జరిగింది. మొదటి కనుమ రహదారి 58వ మలుపు వద్ద బ్రేకులు ఫెయిలై జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులకు స్వల్పగాయాలయ్యాయి.
*రామచంద్రాపురం పీఎస్ ఎదుట వివాహిత నిరసన చేపట్టింది. అదనపు కట్నం తేవాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టింది. ఫిర్యాదు చేసి 3 నెలలవుతున్నా ఎస్.ఐ. కేసు నమోదు చేయలేదని, న్యాయం జరిగేవరకు కదిలేది లేదని బాధితురాలు తెలిపింది.
*యర్రావారిపాలెం మండలం తెట్టుపల్లెలో విషాదం చోటుచేసుకుంది. పిడుగు పడటం వల్ల సిద్ధమ్మ(70) అనే వృద్ధురాలు మృతి చెందగా, ఒక గోవు మరణించింది.
*శ్రీకాళహస్తి ముత్తరాశిపాలెం వద్ద ఆగి ఉన్న ఆటోపై భారీ చెట్టు కూలింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
*పాకాల మండలం వడ్డేపల్లిలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడో తరగతి విద్యార్థి అనిల్ మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా:పడమరవీరాయపాలెంలో పొలం పనులకు వెళ్లిన రాములమ్మ అనే మహిళ పాముకాటుకు గురై మృతి చెందింది.
* ప్రకాశం జిల్లా పామూరు మండలం కోడిగుంపల గ్రామంలో పిడుగు పడి వేమూరి అయ్యన్నకు చెందిన రెండు గేదలు మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.1,20,000/-ల రూపాయలు ఉంటాయని బాధితుడు అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశాడు.
*కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2,400 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.
వైఎస్సార్ జిల్లా:జిల్లాలో ఎర్రచందనం దుంగలు తరలించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం చెట్లు నరికి దుంగలుగా మార్చి తరలించే భాకరాపేట, చింతరాజుపల్లెకు చెందిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరి కొందరికి ప్రమేయం ఉన్నట్లు , వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.
*కడప రిమ్స్ వెనుకవైపు అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
*వేంపల్లి శివారు రామలింగయ్య కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధం అయ్యాయి.
*కలసపాడు మండలం తెల్లపాడు అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడులలో పెద్ద ఎత్తున నాటు సారా బట్టీలు ఉన్నట్లు గుర్తించి, బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా కాపు కాస్తున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా: సోమందేపల్లి పాఠశాలలో ప్రమాదం జరిగింది. పాఠశాలలో పరీక్ష రాస్తుండగా పైన ఉన్న ఫ్యాన్ ఊడి పడి బాలికకు గాయాలయ్యాయి.
బాపట్ల జిల్లా: వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ప్రమాదం జరిగింది. పందిళ్లపల్లిలోని బైపాస్ రోడ్డులో ఉన్న కారును లారీ ఢీకొనడంతో కొత్తపేట వాసులు ధర్మరాజు(20), కనకారావు(41) మృతి చెందారు.
*రేపల్లె పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. 1 వ వార్డ్ ఎస్టీ కాలనీలో ప్రమాద వశాత్తూ ఓ పూరింటికి నిప్పు అంటుకుంది. గాలుల వలన మంటలు వ్యాపించి అదే వరుసలో ఉన్న మరికొన్ని ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. ఘటనలో 20 పురిల్లు దగ్ధం అయ్యాయి.
అనంతపురం జిల్లా: రాయదుర్గంలో కర్ణాటక దొంగల హల్‌చల్ చేశారు. పందులను దొంగిలించేందుకు వాహనంలో వచ్చిన దొంగలు రాయదుర్గంలో మేడపై నిద్రిస్తున్న వారిపై ఖాళీ మద్యం సీసాలతో దాడి చేశారు. దొంగలను పోలీసులు వెంటపడడంతో బళ్లారి రోడ్డులో బొలెరో వాహనాన్ని వదిలి పరారయ్యారు.
*విడపనకల్లులో ప్రమాదం జరిగింది. పరీక్ష రాసి ఆటోలో ఇంటికెళ్తున్న విద్యార్థినుల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
విజయనగరం జిల్లా: బొండపల్లిలో జాతీయ రహదారిపై విశాఖ డెయిరీ పాల ట్యాంకర్, కారు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమం కాగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
పల్నాడు జిల్లా:చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన తొండపి నరసింహారావు(55) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*సత్తెనపల్లి పట్టణంలోని మూడు మొబైల్ షాపుల్లో కొందరు గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*చిలకలూరిపేటలో మద్యం తాగి ఇద్దరు అస్వస్థత గురైయ్యారు. అందులో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా:నందిగాం మండలం పీవీపురం వద్ద చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు.
*కవిటి మండలం కోజ్జిరి హైవే సమీపంలో 60 వేల రూపాయలవిలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి చింతపేటకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి పై కేసునమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నంద్యాల జిల్లా:అంకిరెడ్డిపల్లె పరీక్షా కేంద్రంలో పదో తరగతి తెలుగు సబ్జెక్ట్ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన కేసులో 21 మందిని అరెస్టు చేసినట్లు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. అలాగే నందికొట్కూరులో బయటకు వచ్చిన ప్రశ్న పత్రం అంశపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
*నంద్యాలలోని స్థానిక పద్మావతినగర్‌లో ఓ సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భవనం పై నుంచి కింద పడ్డాడా లేక ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో ఈతకు వెళ్లిన తుడిచెర్ల గ్రామానికి చెందిన మాలిక్ (13) అనే బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఓర్వకల్లు పోలీసులు పేర్కొన్నారు.
*ఆలూరులో పదోతరగతి లెక్కల ప్రశ్నపత్రం లీక్ కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లా:నాదెండ్ల మండలంలోని గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్థానిక సాహితి స్పిన్నింగ్ మిల్లు ఎండీ వజ్రాల రామిరెడ్డి మృతిచెందాడు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసి కింద పడిపోవడంతో తలకు ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరంగి పోలీసులు తెలిపారు.
కోనసీమ జిల్లా:ఐ పోలవరం మండలం మురుమళ్ల గ్రామంలోని గోదావరి నదిలో 55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాయచోటి డి.ఎస్.పి శ్రీధర్ పేర్కొన్నారు . అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మాజీ స్మగ్లర్లు, గతంలో ఎర్రచందనం రవాణాతో సంబంధాలున్న అనుమానితులకు డీఎస్పీ శ్రీధర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎర్రచందనం నరికిన, అక్రమంగా తరలించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.
బాపట్ల జిల్లాలో వీధి కుక్కల స్వైరవిహారం: కారంచేడు మండలం తిమిడిదపాడులో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ బాలుడు కుక్కకాటుకు గురికాగా.. ఇవాళ ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. గ్రామానికి చెందిన బైరాపోగు రాజశేఖర్ కూతురు శ్వేత(6)పై.. రాత్రి 8 గంటల సయమంలో ఇంటి ముందు వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ శ్వేతను చీరాల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం గురించి పంచాయితీ అధికారులకు చెప్పినా.. పట్టించుకోవడంలేదని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ భారీ నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Murder: స్నేహితుడిని నరికి చంపిన యువకుడు